ఊహకందని రీతిలో మారుతున్న వాతావరణ పరిస్థితులు రైతులను నిరాశలోకి నెట్టేస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు లాంటి ప్రకృతి విపత్తులతో రైతులు భారీ స్థాయిలో పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు.
గత ఐదేళ్లలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశంలో 80 శాతం మంది రైతులు తమ పంటలను నష్టపోయారు. పలు రాష్ట్రాల్లో వివిధ కారణాలతో నాట్లు వేయడం, విత్తనాలు విత్తడంలో జాప్యం జరుగుతున్నదని, ఇది పంటల దిగుబడిపై ప్రభావం చూపుతున్నదని నిపుణులు అంటున్నారు. ఫోరమ్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఫర్ ఈక్విటబుల్ డెవలప్‌మెంట్ (ఫీడ్) తాజాగా విడుదల చేసిన నివేదికలో దేశంలోని రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
దేశంలోని 21 రాష్ట్రాల్లోని 6,615 మంది రైతుల నుంచి ఫీడ్ పలు వివరాలు సేకరించింది. దేశంలో సంభవించిన పంట నష్టాల్లో 41 శాతం కరువు కారణంగా, 32 శాతం సక్రమంగా వర్షాలు కురియక, 24 శాతం రుతుపవనాల ముందస్తుగా లేదా ఆలస్యంగా వచ్చిన కారణంగా సంభవించినట్లు ఫీడ్ సర్వేలో తేలింది.
సర్వేలో పాల్గొన్న రైతులలో 43 శాతం మంది తమ పంటలో కనీసం సగం పంట నష్టపోయామని తెలిపారు. ముఖ్యంగా వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు అధిక వర్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో వరి పొలాల్లో కొత్తగా నాటిన మొక్కలకు నష్టం వాటిల్లింది. అదేవిధంగా తక్కువ వర్షపాతం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లను ప్రభావితం చేసింది. బెంగాల్ తదితర రాష్ట్రాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, వేరుశనగ తదితర పంటల విత్తనాలు నాటడంలో ఆలస్యం జరిగింది. ఇది పంట దిగుబడులపై ప్రభావం చూపనున్నదని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment