పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన ఉద్యోగి? | After Pune, Now Lucknow Woman Dies After Falling Off Chair Dur To Work Pressure, Says Report | Sakshi
Sakshi News home page

పని ఒత్తిడితో కుర్చీలోనే కుప్పకూలిన ఉద్యోగి?

Published Wed, Sep 25 2024 8:57 AM | Last Updated on Wed, Sep 25 2024 10:54 AM

After Pune Now Lucknow Woman Dies Of Work Pressure Says Report

లక్నో: పని ఒత్తిడి మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. పూణే ఉద్యోగి ఘటన మరవక ముందే.. లక్నోలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తూ కుర్చీలోనే ప్రాణాలు వదిలింది ఓ బ్యాంకు ఉద్యోగిణి!. 

ఉత్తర ప్రదేశ్‌ గోమతినగర్‌లోని ఓ ప్రైవేట్‌బ్యాంకులో మంచి పొజిషన్‌లోనే సదాఫ్‌ ఫాతిమా పని చేస్తోంది. మంగళవారం (సెప్టెంబర్‌ 24) డ్యూటీకి హాజరైన ఆమె కుర్చీలోనే కూలబడింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. అయితే.. అడిషనల్‌ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఆమెకు ఈ మధ్యే ప్రమోషన్‌ వచ్చిందని.. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన పని ఒత్తిడికి గురైందని ఆమె తోటి ఉద్యోగులు చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణలపై సదరు బ్యాంకు స్పందించాల్సి ఉంది. 

ఈ ఘటనపై సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ ఎక్స్‌ ద్వారా స్పందించారు. ఆర్థిక లక్ష్యాల సాధన ఒత్తిడే.. ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని ఆరోపించారాయన. ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థలు ఎకానమీ టార్గెట్‌లను సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అది ఉద్యోగులపై పడుతోంది.  అందుకే ఇలాంటి మరణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇది ముమ్మాటికీ ఆందోళన కలిగించే అంశం. దీనిని అడ్డుకట్ట పడాలంటే.. ఆరోగ్యకరమైన పని వాతావరణం కలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పేర్కొన్నారు.

 

పని ఒత్తిడి కారణంగానే కేరళ కొచ్చికి చెందిన యువ సీఏ అన్నా సెబాస్టియన్‌ పెరియాళి కన్నుమూసిందన్న వార్త.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జులైలో పుణెలోని సంస్థ కార్యాలయంలో తన విధుల్లో ఉండగా.. అస్వస్థతకు గురవడంతో తోటి ఉద్యోగులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కాసేపటికే మరణించారు. అయితే పని ఒత్తిడే ఆమె మరణానికి కారణమంటూ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు అన్నా సెబాస్టియన్‌ తల్లి అనితా తాజాగా ఈవై ఇండియా హెడ్‌కు లేఖ రాయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి.. పని ఒత్తిడి అంశం అటు ఉద్యోగ వర్గాల్లోనూ.. ఇటు దేశ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు కేంద్ర కార్మికశాఖ ఈ అంశంపై విచారణకు ఆదేశించగా.. మానవ హక్కుల కమిషన్‌ సైతం ఈ అంశంలో జోక్యం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement