ముంబై : శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సర్కార్‌ను మూడు చక్రాల బండితో పోలుస్తూ స్టీరింగ్ తన చేతిలో ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్థవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై సంకీర్ణ సర్కార్‌లోనే కలకలం రేగిందనే సంకేతాలు వెల్లడయ్యాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఠాక్రేకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూనే దీటుగా కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో వాహనంలో ఆయన పక్కనే తాను కూర్చున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఠాక్రేకు అజిత్ పవార్ బర్త్‌డే విషెస్ చెప్పారు. అయితే ఈ ఫోటోలో వాహనం స్టీరింగ్ అజిత్ పవార్ చేతిలో ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధిపతి, మహా వికాస్ అఘది నేతకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పవార్ తన పోస్ట్‌ను ముగించారు.
ముఖ్యమంత్రి స్టీరింగ్ వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ అజిత్ పవార్ చేసిన పోస్ట్‌కు పలువురు స్పందించారు. సీఎంను అభినందిస్తూ స్టీరింగ్ మీ చేతిలో ఉన్న ఫోటోను ఎందుకు వాడారు దాదాజీ అంటూ ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆయయనను ప్రశ్నించారు. కాగా తన సర్కార్‌ను విపక్షాలు కూల్చలేవని..తన ప్రభుత్వ భవితవ్యం వారి చేతిలో లేదని ఠాక్రే వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వం ఆటోరిక్షా(త్రిచక్రవాహనం) వంటిదని, దాని స్టీరింగ్ తన చేతిలో ఉందని, వెనుక సీట్లలో కాంగ్రెస్, ఎన్సీపీలు ఉన్నాయని ఠాక్రే పేర్కొన్నారు. దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చాలని పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీకి ఠాక్రే సవాల్ విసిరారు. ఉద్ధవ్ ఠాక్రే సోమవారం 60వ ఏట అడుగుపెట్టారు. అయితే ఠాక్రే వ్యాఖ్యల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్ చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి : బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్
Comments
Please login to add a commentAdd a comment