
ఈడీ ఏడుసార్లు పంపిన సమన్లను పక్కకు పెట్టిన సోరేన్.. మరో కీలక నిర్ణయం
రాంచీ: అక్రమ మైనింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్‌కు కేంద్రంకు మధ్య ప్రతిష్టంభణ కొనసాగుతోంది. ఈడీ ఏడుసార్లు పంపిన సమన్లను పక్కకు పెట్టిన సోరేన్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపిన సమన్లను పట్టించుకోవద్దని రాష్ట్ర అన్ని శాఖలకు తెలిపారు. ఎలాంటి ఫైల్స్, సమాచారానికి సంబంధించిన ప్రశ్నలు అడిగినా సమాధానం ఇవ్వకూడదని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమాచారాన్నైనా నేరుగా రాష్ట్ర కేబినెట్ సెక్రటేరియట్‌కు అందించాలని స్పష్టం చేశారు.
కేంద్ర సంస్థల నోటీసులకు అధికారులు నేరుగా స్పందించవద్దని బదులుగా కేబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్ విభాగానికి తెలియజేయాలని సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వందనా దాడెల్ అన్ని శాఖలకు రహస్యంగా పంపిన లేఖలో పేర్కొన్నారని సమాచారం. ఎలాంటి సమాచారాన్నైనా ఉన్నత అధికారులకు తెలియజేయకుండా రాష్ట్ర ఉద్యోగులు నేరుగా ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం సరైన విధానం కాదని లేఖలో దాడెల్ తెలిపారు. ఈడీకి రాష్ట్ర అధికారులు అసంపూర్ణ సమాచారాన్ని అందజేయకుండా ప్రక్రియను క్రమబద్ధీకరిస్తున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ చర్య కేంద్ర సంస్థలకు సహకరించకపోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ సోరేన్‌పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందుకు రావాల్సిందిగా ఈడీ హేమంత్ సోరెన్‌కు వరుసగా ఏడుసార్లు సమన్లు పంపింది. కానీ వివిధ కారణాలతో ఆయన ఈడీ ముందు హాజరుకాలేదు.
జార్ఖండ్‌లో కాంగ్రెస్‌తో కలిసి జార్ఖండ్ ముక్తీ మోర్చా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఈ ప్రభుత్వంలో దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఇండియా కూటమిలో భాగంగా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని సోరెన్ సర్కార్ విమర్శిస్తోంది.
ఇదీ చదవండి: జార్ఖండ్ సీఎంకు ఏడోసారి ఈడీ నోటీసులు.. ఆయన సోదరి ఫైర్