Amritpal Singh Hunt Row: Punjab CM Bhagwant Mann Key Announcement, Details Inside - Sakshi
Sakshi News home page

80వేల మంది పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. పాక్‌ ఏజెంట్‌గానే సూసైడ్‌ ఎటాక్స్‌కు ప్లాన్‌

Published Tue, Mar 21 2023 3:40 PM | Last Updated on Tue, Mar 21 2023 4:23 PM

Amritpal Singh Hunt Row: Punjab CM Bhagwant Mann Key Announcement - Sakshi

ఖలిస్తానీ-పాకిస్తాన్‌ ఏజెంట్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ Amritpal Singh వ్యవహరంలో పంజాబ్‌-హర్యానాల హైకోర్టు.. పంజాబ్‌ ప్రభుత్వంపై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌పాల్‌ను అరెస్ట్‌ చేయడంలో విఫలం కావడంపై మండిపడ్డ కోర్టు..  చేపట్టిన ఆపరేషన్‌ తాలుకా నివేదికను సమర్పించాలని పంజాబ్‌ పోలీస్‌ శాఖను ఆదేశించింది. 

మీదగ్గర ఎనభై వేలమంది పోలీసులున్నారు. ఏం చేస్తున్నట్లు? అసలు అమృత్‌పాల్‌ సింగ్‌ ఎలా తప్పించుకున్నట్లు? అని పంజాబ్‌ సర్కార్‌పై ఆగ్రహం వెల్లగక్కింది.   ఇది పూర్తిగా నిఘా వర్గాల ఫెయిల్యూర్‌ అంటూ వ్యాఖ్యానించింది కోర్టు.  ఈ తరుణంలో.. అతన్ని అరెస్ట్‌ చేసేందుకు శనివారం నుంచి భారీ ఎత్తున్న చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. ఇప్పటిదాకా 120 మంది అమృత్‌పాల్‌ అనుచరుల్ని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.  

అంతకు ముందు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఈ పరిణామాలపై స్పందించారు. పంజాబ్‌ కోరుకునేది శాంతి, అభివృద్ధి మాత్రమే. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఊపేక్షించబోం. కఠినంగా అణచివేస్తామని ప్రకటించారు.  

ఖలీస్తానీ-పాకిస్తాన్‌ ఏజెంట్‌గా అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ‘వారిస్‌​ పంజాబ్‌ దే’ సిక్కు గ్రూప్‌ చీఫ్‌గా.. అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి దానిని స్థాపించింది సందీప్‌ సింగ్‌ అలియాస్‌ దీప్‌ సింగ్‌ అనే పంజాబీ నటుడు కమ్‌ ఉద్యమకారుడు. పంజాబీల హక్కుల సాధన-పరిరక్షణ విషయంలో కేంద్రంతో కొట్లాడేందుకు ఈ గ్రూప్‌ను స్థాపించాడు. సందీప్‌ నుంచి వారసత్వంగా విభాగపు బాధ్యతలు తీసుకున్నాడు అమృత్‌పాల్‌ సింగ్‌.  అయితే హక్కుల గ్రూప్‌ను కాస్త.. ఉగ్రవాదంపై మళ్లించినట్లు అమృత్‌పాల్‌ సింగ్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి ఇప్పుడు. ఉదమ్యం ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు నిఘా వర్గాలు కాస్త ఆలస్యంగా గుర్తించాయి. కిందటి నెలలో తన అనుచరులను ఉసిగొల్పి ఓ పోలీస్‌ స్టేషన్‌పై మారణాయుధాలతో దాడికి దిగి.. తన ప్రధాన అనుచరుడిని విడిపించుకున్నాడు. ఈ దాడిలో ఆరుగురు పోలీస్‌ సిబ్బంది గాయపడ్డారు.

ఈ  ఉదంతాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న పంజాబ్‌లోని ఆప్‌ సర్కార్‌, కేంద్రంతో పాటు అసోం ప్రభుత్వ సాయంతో అమృత్‌పాల్‌ సింగ్‌ని, అతని ప్రధాన అనుచరుల్ని అరెస్ట్‌ చేసేందుకు రహస్య ప్రణాళికను అమలు చేసింది. ఈ మేరకు మార్చి 2వ తేదీన పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసి అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌కు వ్యూహం అమలు చేసే విధానంపై చర్చించినట్లు తెలుస్తోంది. 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. ఖలిస్తానీ-పాకిస్తాన్‌ ఏజెంట్‌ అయిన అమృత్‌పాల్‌ సింగ్‌ పక్కా ప్లాన్‌తోనే పంజాబ్‌లో వారిస్‌​ పంజాబ్‌ దే గ్రూప్‌ను నడిపిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. అనుచరుల పేరుతో బలగం తయారు చేసుకుని.. ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక గీశాడు. ఈ మేరకు పాక్‌ నుంచి వచ్చిన అక్రమాయుధాలను.. డీ ఆడిక్షన్‌ కేంద్రాల్లో భద్రపరిచినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు అమృత్‌పాల్‌ సింగ్‌పై ఆయుధాల చట్టం కింద మరో కేసు నమోదు చేసి.. ఉగ్రకోణంలో దర్యాప్తు చేయాలనే ఆలోచనలో ఉంది కేంద్రం. ఈ కేసులో ఏ1గా అమృత్‌పాల్‌ సింగ్‌ పేరును చేర్చింది కూడా. 

ఇదిలా ఉంటే.. అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరుల అరెస్ట్‌ పేరిట..  పంజాబ్‌ గ్రూప్‌ల కీలకసభ్యులను.. ఉద్యమకారులను, అమాయకపు పంజాబీ యువతను అరెస్ట్‌ చేస్తున్నారని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నారని, కుట్రను అంచనా వేయడంలో ఆప్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే.. అలాంటిదేం జరగడం లేదని సీఎం మాన్‌ ఇవాళ వివరణ ఇచ్చుకున్నారు. 

ఇక.. విదేశాల్లోని పంజాబీ గ్రూప్‌లను.. ఖలిస్తానీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం నాలుగు రోజులుగా వేట కొనసాగుతున్న వేళ.. విదేశాల్లోని వివిధ భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తాన్‌ మద్దతుదారులు దాడులకు తెగపడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌ దాటేసి పారిపోయి ఉంటాడన్న అనుమానాలతో అంతర్జాతీయ సరిహద్దులను సైతం అప్రమత్తం చేసింది కేంద్రం.

సంబంధిత వార్త: పంజాబ్‌ వదిలి పారిపోయిన అమృత్‌పాల్‌ సింగ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement