
న్యూఢిల్లీ: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. యూపీ, బీహార్‌లోని పలు స్టేషన్లలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. యూపీలోని మధురలో పరిస్థితులు అదుపు తప్పడంతో ఆందోళనకారులపై పోలీసులు ఫైరింగ్ చేశారు. బిహార్ అగ్నిగుండంగా మారింది. నిరుద్యోగులు పలు రైల్వేస్టేసన్లలో విధ్వంసానికి దిగారు. నిరసనకారుల ఆందోళనలతో బిహార మీదుగా వెళ్లే 34 రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. బిహార్ డిప్యూటీ సీఎం రేణుదేవి, బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇళ్లపైనా నిరసనకారులు దాడికి పాల్పడ్డారు.
ఢిల్లీలోనూ ఆందోళనలు
దేశ రాజధాని ఢిల్లీలోనూ అగ్నిపథ్ ఆందోళనలు ఉధృతమయ్యాయి. దీంతో మెట్రో రైళ్లను నిలిపివేశారు. అనేక చోట్ల పరిస్థితులు చేయిదాటుతున్న నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జి చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కాల్పులకు దిగుతున్నారు.
చదవండి: (అమిత్‌షాతో కిషన్ రెడ్డి కీలక భేటీ)
అసలేంటి అగ్నిపథ్?
దేశ రక్షణకు వెన్నెముకగా నిలిచే త్రివిధ దళాల్లో సంస్కరణలకు అంకురార్పణ చేస్తూ కేంద్రం ‘అగ్నిపథం’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద త్రివిధ దళాల్లో చేర్చుకునేవారికి కూడా ఘనమైన పేరే పెట్టారు. వారిని ‘అగ్నివీర్’లు అంటారు. 17.5– 21 ఏళ్ల మధ్యవయస్కులను సైనికులుగా ఎంపిక చేస్తారని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
ఇది నాలుగేళ్ల కాంట్రాక్టు నియామకానికి సంబంధించిందే అయినా, మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించేవారి సర్వీసు కొనసాగుతుంది. ఏటా నాలుగోవంతు మంది బయటకు రాకతప్పదు. సాంకేతిక నైపు ణ్యాలు తప్పక అవసరమైన వైమానిక, నావికా దళాలకు ఈ పథకం సాధ్యపడకపోవచ్చు. కనుక ప్రధానంగా సైనికదళంలోనే ఈ ‘అగ్నివీర్’ల ఉనికి ఉంటుందనుకోవాలి.
ఈ పథకానికి లభించే ఆదరణనుబట్టి ప్రస్తుత నియామక విధానానికి క్రమేపీ స్వస్తి పలుకుతారు. సైనిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. కార్గిల్ యుద్ధ సమయం నుంచీ అది తరచు ప్రస్తావనకొస్తూనే ఉంది. కానీ జరిగిందేమీ లేదు. 2014లో అధికారంలోకొచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం 2016లో ఒక కమిటీని నియమించింది. ఫలితంగా ఈ ‘అగ్నిపథం’ ఆవిష్కృతమైంది.
Comments
Please login to add a commentAdd a comment