సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ నిరసన జ్వాలలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మండిపోతోంది. ఇంకా రైల్వే ట్రాక్ పైనే వేలాదిమంది ఆందోళనకారులు ఉండిపోయారు. ఆందోళన విరమించకపోతే.. మళ్లీ కాల్పులు జరుపుతామని హెచ్చరించారు రైల్వే పోలీసులు. అయితే.. కాల్పులు జరిపినా వెనక్కి తగ్గేది లేదని ఆందోళనకారులు అంటున్నారు.
శుక్రవారం ఉదయం హఠాత్తుగా మొదలైన అగ్నిపథ్ నిరసనల కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసులు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన రాకేష్ మృతి చెందాడు. ఖమ్మంకు చెందిన నాగేందర్ బాబు(21), వక్కరి వినయ్(20), కర్నూల్ మంత్రాలయానికి చెందిన రంగస్వామి(20), కరీంనగర్ చింతకుంట గ్రామానికి చెందిన రాకేష్(20), శ్రీకాంత్ (మహబూబ్‌నగర్, పాలకొండ విల్), కుమార్(21) వరంగల్, పరశురాం(22) నిజాంసాగర్ కామారెడ్డి జిల్లా గాయపడ్డారు.
రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో వాట్సాప్‌లో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పరీక్షలు రద్దు కావడంతో వాళ్లలో ఆవేశాగ్రహాలు పెల్లుబిక్కాయి. రెండు రోజుల కిందటే.. జిల్లాల నుంచి ఆర్మీ ఉద్యోగాల ఆశావహులు నిరసనలకు పిలుపు ఇచ్చారు. అనంతరం.. గురువారం రాత్రే సుమారు 500 మంది నిరసనకారులు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. రైళ్లను ఆపేసి ఆందోళన వ్యక్తం చేయాలనుకున్నారు. అయితే పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగడంతో విధ్వంసం చేపట్టారు. సదరు వాట్సాప్ గ్రూప్‌పై ఇప్పుడు రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు.
- శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ బయటే కాసేపు నిరసనలు వ్యక్తం చేసిన ఆందోళనకారులు.. ఓ బస్సు అద్దాలు పగలకొట్టారు.
- ఉదయం 9గం. సమయంలో స్టేషన్ లోపలికి వచ్చి పట్టాలపై బైఠాయించారు.
- స్టేషన్‌లో ఉన్న రైళ్ల కిటీకీ అద్దాలను ధ్వంసం చేసి.. స్టాళ్లను సైతం పగలకొట్టారు.
- రైల్వే పార్శిల్స్ విభాగం వద్ద ఉన్న సంచులను పట్టాలపైకి చేర్చి తగలబెట్టారు.
- ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో నిరసనలు ఒక్కసారిగా వేడెక్కాయి.
- లాఠీఛార్జ్, టియర్‌గ్యాస్ లాభం లేకపోవడంతో గాల్లోకి రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment