ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రతి రోజు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీకు దండం పెడతాను.. దయచేసి మాస్క్ ధరించండి అంటూ ప్రజలను వేడుకున్నారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, ఇతర అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో కరోనా నాల్గవ వేవ్ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుంది. మార్చి 16న 425 కొత్త కేసులు నమోదయితే.. ఈ రోజు వాటి సంఖ్య 3,500కు చేరుకుంది. ప్రస్తుతానికి అయితే లాక్‌డౌన్ విధించే ఆలోచన మాత్రం లేదు. ప్రజలను నేను కోరుకునేది ఒక్కటే.. మాస్క్ ధరించండి.. జాగ్రత్తలు పాటించండి’’ అని వేడుకున్నారు కేజ్రీవాల్.
కోవిడ్-19 టీకా విషయంలో వయస్సు పరిమితులను తొలగించాలని.. అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వాన్ని అనుమతించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కేజ్రీవాల్. "టీకాలు సురక్షితమే అనుకుంటే.. అన్ని వర్గాల ప్రజలకు వాక్సిన్ వేయడానికి కేంద్ర ప్రభుత్వం మాకు అనుమతిస్తే.. యుద్ధ ప్రాతిపదికన వేలాది టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. ఇది కోవిడ్ -19 యొక్క వ్యాప్తిని అరికట్టడానికి సహాయపడుతుంది" అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment