న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విపాసన ధ్యానం కోర్సుకు బయల్దేరారు. నేటి నుంచి పది రోజులపాటు ఆయన ధ్యానం కోర్సులో పాల్గొననున్నారు. డిసెంబర్ 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
కాగా కేజ్రీవాల్ ప్రతి ఏడాది చలికాలంలో విపాసన ధ్యానం చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో బెంగళూరు, జైపుర్ వంటి నగరాల్లో ఆయన ఈ శిక్షణకు హాజరయ్యారు. అయితే ఈసారి ఎక్కడికి వెళ్తున్నారనేది మాత్రం వెల్లడించలేదు.
ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21 విచారణకు హాజరు కావాలని తెలిపింది. అయితే ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్ విపాసన మెడిటేషన్ సెషన్‌కు హాజరు అవుతుండంతో.. మరోసారి ఈడీ విచారణకు ఆయన గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా విపాసన ధ్యానం ముందుగా నిర్ణయించిన కార్యక్రమమని ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దా చెప్పారు. ఈడీ నోటీసులపై న్యాయ నిపుణులను సంప్రదిస్తామన్నారు. త్వరలోనే ఈ విషయమై ఈడీకి సమాధానం ఇస్తామని వెల్లడించారు.
చదవండి: అనంతపురం: రూ. 46 లక్షల చోరీ ఘటన.. అంతా డ్రామా..
Comments
Please login to add a commentAdd a comment