![Assam Chief Minister Apologised To Victim Family In Dibrugarh - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/10/Assam.jpg.webp?itok=OTOA_pr5)
గౌహతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాఫియా బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడిన బాధిత కుటుంబానికి క్షమాపణలు చెబుతూ...ఉద్వేగానికి గురయ్యారు. సదరు బాధిత కుటుంబానికి 'సారీ' అని క్షమాపణ చెబుతూ...తానెప్పుడూ ఇంతలా సిగ్గుపడలేదన్నారు. పోలీస్ యంత్రాంగం ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడే సాహసం చేసిందంటే...నిజంగా ఇది చాలా సిగ్గుచేటని అన్నారు.
ఈ మేరకు దిబ్రూఘర్‌లో 32 ఏళ్ల వినిత్ బగారియా అనే యువ వ్యాపారవేత్త మాఫియా బెదిరింపులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుటుంబానికి చెందిన ఓ షాపులోని వ్యక్తితో సహా ముగ్గురు తననను బెదిరిస్తున్నారని, ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నానంటూ..ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసి మరీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సదరు వ్యక్తి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు.
దీంతో పోలీసులు బాధితుడు తెలిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మీడియా సమావేశంలో ఆ ఘటన గురించి మాట్లాడుతూ... ప్రజలతో పోలీసులు స్నేహ పూర్వకంగా మెలగాలని పదేపదే చెబుతున్నప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి గోడుని పట్టించుకోని పోలీసుల పై తగిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment