అతనొక తిరుగుబాటు సంఘానికి సీనియర్ నేత. ఆ గ్రూప్‌లో మిగిలిన ఏకైక సభ్యుడు కూడా. కానీ, భద్రతా దళాలకు కొన్నేళ్లుగా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. పైగా గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో ‘అస్సాం వీరప్పన్’గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. కానీ, అనూహ్యంగా నిర్జీవంగా అడవుల్లో దొరికాడు.
దిస్‌పూర్: మంగిన్ ఖల్‌హౌ.. యునైటెడ్ పీపుల్స్ రెవల్యూషనరీ ఫ్రంట్(యూపీఆర్‌ఎఫ్) కీలక నేత. గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో అతనికి అస్సాం వీరప్పన్‌గా పేరొచ్చింది. అయితే ఆదివారం ఉదయం అతని మృతదేహాన్ని భద్రతా దళాలు అస్సాం దక్షిణ దిశగా కర్బి అడవుల్లో స్వాధీనం చేసుకున్నాయి. కాగా, ఏడాదిగా జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో యూపీఆర్‌ఎఫ్ సీనియర్లంతా చనిపోగా.. మంగిన్ మాత్రం దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
సొంతవాళ్ల చేతుల్లోనే?
మంగిన్‌ది ఎన్‌కౌంటర్ కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అంతర్గత విభేధాలతో వాళ్లలో వాళ్లే కాల్చుకున్నారని, ఆ కాల్పుల్లోనే అతను చనిపోయాడని వెల్లడించారు. శనివారం, ఆదివారం మధ్య జరిగిన కాల్పుల్లో అతను చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కుకీ కమ్యూనిటీకి చెందిన ప్రజలతో ఏర్పడిందే యూపీఆర్‌ఎఫ్. సింగ్‌హసన్ పర్వతాల గుండా స్థావరాల్ని ఏర్పరుచుకుని భద్రతా దళాలపై తరచూ దాడులు చేస్తున్నాయి.
కిందటి ఏడాది అక్టోబర్‌లో గ్రూప్ కమాండర్ మార్టిన్ గుయిటెను పోలీస్ కాల్పుల్లో మరణించగా.. శాంతి ఒప్పందానికి సిద్ధపడుతూ ప్రభుత్వానికి యూపీఆర్‌ఎఫ్ ఓ లేఖ కూడా రాసింది. కానీ, ఆ లొంగుబాటు ఆలస్యం అవుతూ వస్తుండగా.. ఈ మధ్యలో ఎదురుకాల్పుల్లో గ్రూప్ సభ్యులు చనిపోతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంగిన్‌కు, యువ సభ్యులకు మధ్య పొగసకపోవడమే అతని మరణానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మంగిన్ మరణంపై సంఘం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment