బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఐదు తోడేళ్లను పట్టుకున్న అటవీశాఖ అధికారులు ఇక ఒక తోడేలు మాత్రమే మిగిలివుందని, దానిని కూడా త్వరలోనే పట్టుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడి ప్రజల దృష్టి ఆ ఆరో తోడేలుపైనే నిలిచింది. తాజాగా తోడేళ్ల వేటకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసినవారంతా భయాందోళనకు గురవుతున్నారు.
బహ్రాయిచ్ పరిధిలోని నాన్పరా ప్రాంతంలో రెండు తోడేళ్లు ఏడడుగుల గోడను దూకి, అక్కడ కట్టివున్న ఒక మేకను నోట కరుచుకుని తీసుకువెళుతున్న దృశ్యం ఆ సీసీటీవీలో రికార్డయ్యింది. జనసాంద్రత కలిగిన ఆ ప్రాంతంలో ఇలా జరగడంపై స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో రెండు తోడేళ్లు కనిపిస్తున్నాయి. ఒక తోడేలు ఆ మేక మెడను కొరికి పట్టుకోగా, మరొక తోడేలు ఆ మేక వెనుక భాగాన్ని పట్టుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామస్తులు ఆ మేక కోసం వెదుకగా సమీపంలోని ఒక మామిడి తోటలో ఆ మేక తల, కాలు కనిపించాయి.
ఈ ఘటన గురించి ఆ మేక యజమాని మున్నా మాట్లాడుతూ తాము రాత్రి భోజనం చేశాక, అంతా పడుకున్నామని, ఇంటి బయట ఉన్న సిమెంటు స్తంభానికి మేకను తాడుతో కట్టివేశామన్నారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో మేక అరుపులు వినిపించి, తామంతా బయటకు వచ్చేసరికి మేకను పట్టుకుని రెండు తోడేళ్లు పరుగులు తీయడం కనిపించిందన్నారు. ఇంతలో చుట్టుపక్కల ఉన్నవారంతా సంఘటనా స్థలానికి వచ్చారన్నారు. ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశామని, వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారన్నారు.
ఇది కూడా చదవండి: మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం
Comments
Please login to add a commentAdd a comment