బెంగళూరు: భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ (34) కేసు కీలక మలుపు తిరిగింది. అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా, అత్త నిషా, బావమరిది అనురాగ్‌ను ఆదివారం ఉదయం కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అతుల్ భార్య నికితా సింఘానియాను హర్యానాలోని గురుగ్రామ్‌లో అరెస్టు చేయగా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు మరో పోలీసు అధికారి ధృవీకరించారు.
ఇదిలా ఉంటే.. తన సోదరుడు అతుల్ సుభాష్ అతని భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పారని ఆరోపిస్తూ అతుల్ సోదరుడు బికాస్ కుమార్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. నిఖిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిపి ఐదుగురిపై కేసు నమోదయ్యింది. ఈ కేసు విచారణ కోసం ఓ దర్యాప్తు బృందాన్ని బెంగళూరు పోలీసులు జౌన్‌పూర్‌కు పంపారు. నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఆదివారం ఉదయం వారిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే, కేసు విచారణ నిమిత్తం మూడు రోజుల్లోగా హాజరుకావాలని నిందితులకు బెంగళూరు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
అతుల్ సుభాష్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు
నిఖితా సింఘానియా.. 2019లో ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అతుల్ సుభాష్‌కు పరిచయమైంది. ఈ ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. అదే ఏడాది ఇద్దరికీ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత బెంగళూరుకు ఈ జంట మకాం మార్చింది. వీరిద్దరికి ఓ బాబు పుట్టాడు. అయితే.. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
కొడుకును తీసుకుని నిఖిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. గత మూడేళ్లుగా ఆమె సుభాష్‌కు దూరంగానే ఉంటోంది. ఈ క్రమంలోనే జౌన్‌పూర్ కోర్టులో ఆమె విడాకుల కోసం కేసు వేసింది. అలాగే.. అతుల్, ఆయన కుటుంబ సభ్యులపై మొత్తం 9 కేసులు నమోదు చేయించింది. శారీరకంగా హింసించడం, అసహజ శృంగారం, పైగా వరకట్న వేధింపులతో తన తండ్రిని కుంగదీసి గుండెపోటుతో చనిపోయేలా చేయడం.. లాంటి అభియోగాలు అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఓ ప్రముఖ కంపెనీలో పని చేస్తోంది. అయితే అతుల్ మరణంతో.. అతన్ని అంతగా వేధించిన ఆమెను ఉద్యోగం తొలగించాలంటూ సదరు కంపెనీలకు పలువురు రిక్వెస్టులు పెడుతున్నారు.
ఈ తరుణంలో బికాస్ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు ఆదివారం ఉదయం అతుల్ సుభాష్ భార్య,అత్త,బావమరిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment