నేరాలు మన సమాజంలోని చీకటి కోణాలను వెల్లడిస్తే, వాటి నివారణకు అనుసరించే మార్గాలు సమాజం తాలూకు సున్నితత్వాన్ని, అదే సమయంలో దాని దృఢ సంకల్పాన్ని తెలియజేస్తాయి. ఏటా గడిచిన సంవత్సరంలో జరిగిన నేరాలపై విడుదలయ్యే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు వెలువడతాయి. నేరాల సంఖ్య పెరిగిందని, ఎప్పటిలానే మహిళల భద్రత విషయంలో సంతృప్తికరమైన ప్రగతి సాధించలేకపోయామని, ముఖ్యంగా నగరాల్లో పరిస్థితి ఏమంత గర్వకారణంగా లేదని ఆ నివేదిక చూస్తే అర్థమవుతుంది.
నమోదైన కేసుల ఆధారంగా మాత్రమే ఎన్‌సీఆర్‌బీ నివేదిక రూపొందుతుందని మరిచిపోకూడదు. బాధితుల భయాందోళనలవల్ల పోలీసుల దృష్టికి రాని కేసులు, వచ్చినా రకరకాల ప్రభావాలకు లొంగి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం వంటి కారణాల వల్ల నమోదైన కేసులతో పోలిస్తే... జరిగినవి అనేక రెట్లు అధికంగా ఉండొచ్చు. సామాజిక దురాచారాలు, సంస్కృతి పేరుతో చలామణి అవుతున్న విలువలు, అధికారంలో ఉన్నవారు బాధ్యతారహితంగా మాట్లాడే తీరు మారనంతకాలం నేరాలను సమూలంగా నాశనం చేయడం అసాధ్యం.
అమృతోత్సవాల సందర్భంగా నేర నిరోధక, నేర నివారణ, నేర రహిత భారత్ ఏర్పడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని మోదీజీ పిలుపునిచ్చారు. ఆ పిలుపును సమాజంలోని అన్ని రంగాలవారు, అన్ని స్థాయిలలోని వారు అందుకుని ‘సురక్షిత భారత్’ కోసం పాటు పడాలి.
Comments
Please login to add a commentAdd a comment