ఆనందీబాయి పాశ్చాత్య వైద్యశాస్త్రంలో పట్టా పొందిన తొలి భారతీయ వనిత. పుణెకు చెందిన ఒక సంపన్న శ్రోత్రియ కుటుంబంలో ఆనందీ జన్మించారు. ఆమెకు తొమ్మిదో ఏటనే వివాహం చేశారు. ఆనందీ తన 14వ ఏట ఒక బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డ పదిరోజులకే కన్నుమూయడం ఆమెను కలచివేసింది. బిడ్డకు సరైన వైద్యం అందలేదు. ఆ బాధ నుంచే ఆమెకు తానే వైద్య విద్యను అభ్యసించి, భారతదేశ చిన్నారులకే కాదు, తల్లులకు కూడా వైద్యసేవలు అందించాలన్న గొప్ప సంకల్పం కలిగింది. ఆమె భర్త గోపాల్రావు వైద్య విద్య కోసం పరిచయస్థుల ద్వారా ఆమెకు అమెరికాలో సీటు సంపాదించారు. భార్యను దించి రావడానికి జోషి ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు.
అప్పుడే ఆనందీ ఆరోగ్యంలో మార్పులు ప్రారంభమయ్యాయి. నిరంతరం నిస్సత్తువగా అనిపించేది. తరచూ శిరోభారం ఒకటి. అడపాదడపా జ్వరం. ఒక్కొక్కసారి ఊపిరి సలపనట్టు ఉక్కిరి బిక్కిరిగా ఉండేది. అమెరికా చలి, ఆహారం ఆనందీ ఆరోగ్యాన్ని కుంగదీయడం మొదలుపెట్టాయి. అయినా ఆమె చదువు విషయంలో అశ్రద్ధ చేయలేదు. ఆమె డిగ్రీ తీసుకునే సమయంలో ‘ఫిలడెల్ఫియా పోస్ట్’ పత్రిక చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనం. తరగతిలో ఈ ‘చిన్నారి మహిళ’ ఎంతో ప్రతిభ కనపరిచిందని ఆ పత్రిక రాసింది. 1886 మార్చి 11 న ఆమె ఎం.డి. పట్టా పొందారు.
ఈ పట్టా కోసం ఆమె రాసిచ్చిన సిద్ధాంత వ్యాసం ఏమిటో తెలుసా? ‘పురాతన భారతదేశంలో ప్రసూతి పద్ధతులు’. మహారాష్ట్రలో నాడు స్త్రీ విద్య కోసం పాటు పడుతున్న సంస్కర్త పండిత రమాబాయి, గోపాల్రావ్ జోషి కలసి ఆనందీ పట్టా తీసుకున్న స్నాతకోత్సవానికి వెళ్లారు. ఆ ఇద్దరితో కలసి ఆమె ఇండియా బయలుదేరింది. బొంబాయిలో ఆమెకు ఘన స్వాగతం లభించింది. కానీ ఆమె ఆశయం నెరవేరలేదు.
వైద్య విద్యను అభ్యసించినా, పూర్తి స్థాయిలో తన దేశపు మహిళలకు వైద్యం అందించే అవకాశం ఆమెకు రాలేదు. 21 ఏళ్లు దాటి, 22వ సంవత్సరంలోకి ప్రవేశించిన నెలకే ఆనందీ క్షయ వ్యాధి ముదిరి 1887 ఫిబ్రవరి 26 న శాశ్వతంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. న్యూయార్క్‌లో ఆమెకు ఆశ్రయం ఇచ్చిన మహిళ థియోడిసియా కూడా చలించిపోయారు. ఆనందీ చితాభస్మాన్ని అమెరికాకు తెప్పించుకుని హడ్సన్‌లోని స్మశానవాటికలో తన కుటుంబ సభ్యుల సమాధుల మధ్య ఉంచి, ఆమె పేరున కూడా థియోడిసియా ఒక సమాధిని నిర్మించారు.
(చదవండి: మహోజ్వల భారతి: సరెండర్ నాట్ బెనర్జీ )
Comments
Please login to add a commentAdd a comment