బోస్‌ భుజాల మీద హిట్లర్‌ చెయ్యి వేశాడా! నిజమా?  | Azadi Ka Amrit Mahotsav Subhash Chandra Bose Vs Adolf Hitler | Sakshi
Sakshi News home page

బోస్‌ భుజాల మీద హిట్లర్‌ చెయ్యి వేశాడా! నిజమా?! కథనమా?

Published Thu, Jul 21 2022 1:29 PM | Last Updated on Thu, Jul 21 2022 2:00 PM

Azadi Ka Amrit Mahotsav Subhash Chandra Bose Vs Adolf Hitler - Sakshi

హిట్లర్‌, బోస్‌

హిట్లర్‌ నియంత. నేతాజీ.. నియంతలకే ఒక వింత! స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ గైడ్‌ లైన్స్‌ ఏవీ ఫాలో కాలేదు నేతాజీ. ‘శత్రువుకు చెంప చూపిస్తే స్వరాజ్యం రాదు, గన్‌  తీసి కణతలకు గురిపెడితే వస్తుంది’ అని గాంధీజీతోనే వాదించిన వాడు నేతాజీ. అలాంటి వాడు జర్మనీతో టై–అప్‌ అయి, బ్రిటిష్‌వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ఇండియాకు స్వాతంత్య్రం సంపాదించాలని ప్లాన్‌  వేసుకుని హిట్లర్‌ని కలవడానికి వెళ్లాడు. సహాయం కోసం కాదు, ‘ఇచ్చిపుచ్చు కోవడం’ అనే డీల్‌ కోసం వెళ్లాడు. హిట్లర్‌ కూడా బ్రిటన్‌ పై పోరాడు తున్నాడు కాబట్టి, నేతాజీ సైన్యం (సొంత సైన్యం) హిట్లర్‌కు, హిట్లర్‌ సైన్యం నేతాజీకి హెల్ప్‌ చేస్తుంది.

అది మాట్లాడ్డానికి వెళ్లాడు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు’ అవుతాడు అనే సింపుల్‌ లాజిక్‌తో వెళ్లాడు. తగ్గి వెళ్లలేదు. దేశం కోసం తగ్గితే మాత్రం ఏముంది అనీ వెళ్లలేదు. చెయ్యి కలిపితే కలిపాడు, లేకుంటే లేదు అనుకుని వెళ్లాడు. హిట్లర్‌ అనుచరులు నేతాజీని ఆహ్వానించారు. అయితే హిట్లర్‌ దగ్గరికి వెళ్లనివ్వలేదు. బయటి గదిలోనే కూర్చోబెట్టారు! ‘ఫ్యూరర్‌ లోపల ఇంపార్టెంట్‌ మీటింగులో ఉన్నారు’ అని చెప్పారు. ఫ్యూరర్‌ అంటే లీడర్‌ అని. నేతాజీ చాలాసేపు బయటే వేచి ఉన్నాడు. బల్ల మీద న్యూస్‌ పేపర్లు ఉంటే, వాటిని తిరగేస్తున్నాడు. ఎంతసేపటికీ రాడే హిట్లర్‌! చివరికి వచ్చాడు. వచ్చాక నేతాజీని చూసీచూడనట్లు మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు. నేతాజీ కూడా గమనించీ, గమనించనట్లు ఉండిపోయాడు. హిట్లర్‌ రావడం, నేతాజీని చూడడం; నేతాజీ కూడా హిట్లర్‌ను గమనించడం, గమనించనట్లు ఉండడం.. అలా చాలాసార్లు జరిగింది. తర్వాత మళ్లీ ఒకసారి వచ్చి, నేతాజీ పక్కన నిలుచున్నాడు హిట్లర్‌. నేతాజీ పట్టించుకోలేదు.

పేపర్‌ చదువుతున్నట్లుగా ఉండిపోయాడు. హిట్లర్‌.. నేతాజీ వెనక్కు వెళ్లి నిలుచుని నేతాజీ భుజాలపై చేతులు వేశాడు! వెంటనే నేతాజీ తలతిప్పి చూసి, ‘‘హిట్లర్‌!’’ అన్నాడు. హిట్లర్‌ నవ్వాడు. ‘‘హిట్లర్‌నని నువ్వెలా చెప్పగలవ్‌?’’ అన్నాడు. నేతాజీ నవ్వాడు. ‘‘హిట్లర్‌కి కాకుండా, సుభాస్‌ చంద్రబోస్‌ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అన్నాడు. హిట్లర్‌కి చాలామంది డూప్‌లు ఉండేవాళ్లు. డూప్‌లకు పల్టీకొట్టే రకం కాదు నేతాజీ. ప్రతి లక్ష్యానికీ రెండు దారులు ఉంటాయి. ‘కంటికి కన్ను’ దారొకటి. ‘రెండో చెంప’ దారొకటి. మొదటి దారి నేతాజీది. రెండో దారి గాంధీజీది. అలాగని నేతాజీ.. గాంధీజీని గౌరవించకుండా లేరు! సింగపూర్‌లో ఏర్పాటు చేసుకున్న ‘ఆజాద్‌ హింద్‌’ రేడియోలోంచి 1944 జూలై 6న మాట్లాడుతూ, తొలిసారిగా నేతాజీ.. గాంధీజీ పేరెత్తారు! ‘‘జాతిపితా.. నన్ను దీవించండి. ఈ పోరాటంలో నేను గెలవాలని నన్ను దీవించండి’’అని కోరాడు.

నిజమైనా.. కాకున్నా..
.. బోస్‌ దూకుడు అలాంటిదే. బోస్‌ ఆత్మస్థర్యం అలాంటిదే. దేశంలోని బ్రిటిష్‌ వాళ్లనే అతడు లెక్క చెయ్యలేదు. నచ్చనప్పుడు గాంధీజీ మాట కూడా వినలేదు. యూరప్‌ అంతా తిరిగినవాడికి జర్మనీ ఏంటి? జర్మనీలోని హిట్లర్‌ ఏంటి?  ‘‘హిట్లర్‌కి కాకుండా, సుభాస్‌ చంద్రబోస్‌ భుజాలపై చేతులు వేసే ధైర్యం మరెవరికి ఉంటుంది?’’ అని బోస్‌ హిట్లర్‌తో అని ఉండేందుకైతే అవకాశం లేకపోలేదు. బోస్‌పై ప్రామాణికమైన పుస్తకాలు అనేకం వచ్చాయి.

వాటిల్లో ‘నేతాజీ ఇన్‌ యూరప్‌’ పుస్తకం ఒకటి. అందులో ఈ సందర్భం (బోస్‌ భుజాలపై హిట్లర్‌ చెయ్యేసిన సందర్భం) గురించి లేదు. అలాగే బోస్‌ పై వచ్చిన మరికొన్ని పాపులర్‌ పుస్తకాలు.. ది స్ప్రింగింగ్‌ టైగర్, ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ కవర్‌ అప్, ది ఇండియన్‌ పిలిగ్రిమ్, బోసే స్వయంగా రాసిన ‘లెటర్స్‌ టు ఎమిలీ షెంకెల్‌’, ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ఇన్‌కన్వీయంట్‌ నేషనలిస్ట్, హిస్‌ మెజెస్టీస్‌ అపోనెంట్‌.. వీటిల్లో ఎక్కడా ఆ ఘటనపై చిన్న ప్రస్తావన కూడా లేదు. చరిత్రలో కొన్ని మిస్‌ అవుతాయి. చరిత్ర రచనలో అవి ఊహా వాస్తవాలుగా ప్రత్యక్షం అవుతాయి. ఇదీ అలాంటిదే అయినా కావచ్చు.  

(చదవండి: స్ఫూర్తి యోధులు లాల్‌ బాల్‌ పాల్‌... సమర యోధులు రామయ్య, బసవయ్య, బ్రహ్మయ్య)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement