
మన దేశ నిర్మాణం, ఘనమైన ప్రజాస్వామ్య విధానాల్లో భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పాత్ర ఎనలేనిది. ప్రపంచం మొత్తంమీద భారత్ వాణికి ఒక విలువ ఉందంటే అది నెహ్రూ వల్లనే. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోని సంక్లిష్ట, ప్రమాదకరమైన భౌగోళిక పరిస్థితులతో కూడిన వ్యవహారాలను నెహ్రూ దార్శనికతతో చక్కబెట్టడమే కాదు, తన నాయకత్వ లక్షణాలు, స్వతంత్ర వ్యవహారశైలితో భారత భూభాగాన్ని కాపాడగలిగారు. విదేశీ, దౌత్య వ్యవహారాల్లోనూ నెహ్రూ చెరగని ముద్ర వేశారు.
అంతర్జాతీయ స్థాయిలో పాలనను సూచించే ‘వన్ వరల్డ్’ అన్న అంశంపై నెహ్రూ అప్పట్లోనే విస్తృతంగా రాశారు. ఆయన దార్శనికత వల్లే దేశంలో అణు, అంతరిక్ష కార్యక్రమాలు మొదలయ్యాయి. అత్యున్నత నైపుణ్య కేంద్రాలుగా ఐఐటీలు ఎదిగేందుకు, శాస్త్ర పరిశోధనల నెట్ వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్ ఏర్పాటు, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలూ నెహ్రూ ఆలోచనల ఫలాలే. భారతీయులు శాస్త్రీయ ధోరణిని కలిగి ఉండాలని బోధించినదీ ఈయనే.
నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’.. భారత చరిత్ర పట్లా, తరతరాలుగా దేశ ప్రాపంచిక దృక్పథాన్ని తీర్చిదిద్దిన తాత్విక, మేధా ప్రవాహాల పట్లా, భారతీయులను ఒక్కటిగా ఉంచుతున్న ఘనమైన సాంస్కృతిక వారసత్వం పట్లా ఆయనకు ఉన్న లోతైన అవగాహనకు సాక్ష్యం. భారతదేశ గొప్ప వైవిధ్యాన్నీ, దాని బహుముఖ సాంస్కృతిక మూర్తిమత్వాన్నీ నెహ్రూ శోభావంతం చేశారు. ఈ అమృతోత్సవాల వేళ నెహ్రూ మిగిల్చివెళ్లిన రాజనీతిజ్ఞ వారసత్వాన్ని తప్పక గుర్తు చేసుకోవాలి. ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి.