బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. జంపింగ్ నేతలు పార్టీలు మారే యోచనల్లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో కొందరు ప్రతిపక్ష నేతలు అధికార పార్టీ నేతలను కలవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, ఆప్ నేత భాస్కర్ రావు బీజేపీలోకి ఎంట్రీ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీకి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు తొందరలోనే పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. కాగా, భాస్కర్ రావు.. మంగళవారం కర్నాటక రెవెన్యూ శాఖ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చర్చ సఫలం కావడంతో ఆయన కాషాయతీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, భాస్కర్ రావు.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే.అన్నామలై, కేంద్ర ప్రహ్లాద్ జోషిలను సైతం కలుసుకుని చర్చలు జరిపారు. అయితే, కర్నాటకకు అన్నామలై.. పోల్స్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. భాస్కర్ రావు గతేడాది తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అనంతరం, కేజ్రీవాల్ ఆయనను ఆప్ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా నియమించారు. దీంతో, కర్నాటకలో భాస్కర్ రావు ఆప్‌కు కీలక నేతగా మారారు. ఇక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాస్కర్ రావును ఆప్.. బసవనగుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా బరిలో నిలిపే ప్లాన్ కూడా చేసింది. ఇంతలోనే ఆప్‌కు షాకిస్తూ భాస్కర్ రావు బీజేపీ నేతలతో టచ్‌లో ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment