
సాక్షి, ముంబై: ముంబైకర్ల కోసం కొత్తగా 26 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను శుక్రవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రారంభించారు. ఇటీవలే ఈ బస్సులను బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్) ఆధీనంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బెస్ట్‌లో వంద శాతం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 72కి చేరింది. ముందు 46 ఈ–బస్సులు ఉండగా, తాజాగా 26 బస్సులు బెస్ట్‌లో చేరాయి. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించిన అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే బస్సులో ప్రయాణించారు. ఆయనతో పాటు ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేలతో పాటు పలువురు ప్రముఖులున్నారు.
ఇప్పటికే ముంబైకర్లకు ఉత్తమ సేవలు అందిస్తున్న బెస్ట్ సంస్థ భవిష్యత్‌లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు కాలుష్య రహిత సేవలను అందించాలనే ఉద్దేశంతోనే బెస్ట్ ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన 40, బెస్ట్‌కు చెందిన ఆరు ఇలా మొత్తం 46 ఈ–బస్సులు సేవలందిస్తున్నాయి. దీంతోపాటు తాజాగా టాటా మోటార్స్ కంపెనీ రూపొందించిన 26 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల చేరికతో ఆ సంఖ్య 72కి చేరింది. భవిష్యత్‌లో ఈ బస్సుల సంఖ్య 340కి పెంచుతామని ఈ సందర్భంగా మంత్రి ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ–బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు దివ్యాంగులు ఈ బస్సులో ఎక్కేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.