దేశ రాజధానిలో ప్రభుత్వాధికారుల అజమాయిషీ విషయంలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భేటీ అయ్యి తన మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆదివారం నితీష్‌పై పెద్ద ఎత్తున మాటల దాడి చేశారు. నితీష్‌జీ ప్రధాని కావాలనే పగటి కలతో బీజేపీయేతర పార్టీల కూటమిని ఏర్పరుచుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారా అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా ప్రశ్నించారు.
ముందు మీరు ఆ కలల ప్రపంచ నుంచి బయటకు రండి అని సెటైర్లు వేశారు. ఇతర నేతలను కలవడం మీ హక్కే కానీ, అంతకంటే ముందు మీ సొంత రాష్ట్రంపై దృష్టి పెట్టండని కౌంటరిచ్చారు. ప్రధాని కావాలనే పగటి కలలు కనడం మానేసి దానికి బదులుగా బీహార్ ముఖ్యమంత్రిగా రాజ్యాంగ బాధ్యతలు సంక్రమంగా నిర్వర్తించాలంటూ చురకలంటించారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ సంజయ్ మయూఖ్ మాట్లాడుతూ..నేరాలు, అవినీతి, అరాచకాలతో బిహార్ రాష్ట్రం కూరుకుపోయిందని, రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరని మండిపడ్డారు. కాగా, ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ ఈనెల 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిడం, ఆ తీర్పును పూర్వపక్షం చేసేలా కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే.
(చదవండి: కేంద్రంతో వివాదంలో మా మద్దతు మీకే)
Comments
Please login to add a commentAdd a comment