లక్నో: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు నిన్ను చంపేస్తామని తనకు బెదిరింపులు వచ్చాయని ఓ బీజేపీ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణాపాయం పొంచి ఉందని.. భద్రత కల్పించాలని ఆ మహిళా ఎమ్మెల్యే పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఆమె ఎటావా సదర్ నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు ఉత్తరప్రదేశ్ మహిళా, శిశు అభివృద్ధి జాయింట్ కమిటీ ఎటావా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె కుటుంబంతో పాటు ఆమెను చంపేస్తామని బెదిరింపులతో పోలీసు శాఖ అప్రమత్తమైంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీనియర్ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను చంపేస్తామని తనకు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు వచ్చాయని ఎమ్మెల్యే సరితా భదౌరియా సోమవారం తెలిపారు. పాక్ గూఢచార సంస్థ ఎస్‌ఐఎస్ లోగోతో వాట్సాప్‌లో సందేశాలు వచ్చాయని పోలీసులకు వివరించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో తొలి సందేశం రాగా ఆ తర్వాత వరుస పెట్టి సందేశాలు వచ్చాయని వెల్లడించింది. ఆదివారం ఉదయం వరకు ఎమ్మెల్యేతో పాటు ప్రధాని, బీజేపీ సీనియర్, ఆర్‌ఎస్‌ఎస్ నేతలను చంపేస్తామంటూ 8 సందేశాలు వచ్చాయని పోలీసులకు ఆమె తెలిపింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఎటావా సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆకాశ్ తోమర్ మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యేకు వాట్సాప్‌లో వచ్చిన బెదిరింపు మెసేజ్‌లు పరిశీలించినట్లు తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన +92 సిరీస్‌తో ప్రారంభమైన మొబైల్ నంబర్ నుంచి సందేశాలు వచ్చాయని, వాటిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సరితా భదౌరియా 1999లో భర్త అభయ్ వీర్ సింగ్ భదౌరియా హత్యానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment