లక్నో: గ్యాంగ్‌స్టర్లకు అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరువైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ పాలనా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. వారిలో మాత్రం ఏమాత్రం మార్పు రావడంలేదు. గ్యాంగ్‌స్టర్ వికాశ్ దుబే ఎన్‌కౌంటర్ ఉదంతం మరువకముందే మరో క్రిమినల్ ఏకంగా ఓ ఎమ్మెల్యేపై హత్యా బెదిరింపులకు దిగాడు. యూపీలోని భాగ్పట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న యోగేష్ దామాకు గ్యాంగ్‌స్టర్ సునిల్ రాతి నుంచి హత్యా బెదిరింపులు ఎదురైయ్యాయి. దీంతో భయాందోళనకు గురైన ఎమ్మెల్యే మంగళవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డీజీపీ హితేష్ చంద్ర అవస్థీలకు ఫిర్యారు చేశారు. గ్యాంగ్‌స్టర్ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. (22 ఏళ్ల తర్వాత అదే సీన్ రిపీట్, కానీ..)
అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. సునిల్‌కు సంబంధించిన అక్రమ మైనింగ్‌ను తాను అడ్డుకున్నాని, దానికి ప్రతీకారంగానే తనపై బెదిరింపులకు దిగాడని తెలిపారు. దీనిపై సీఎం యోగి సానుకూలంగా స్పందించి భరోసా ఇచ్చారని చెప్పారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న నేరగాళ్ల పనిపడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో పేరుమోసిన నేరగాళ్లలో ఒకడైన సునిల్ రాతి 2018లో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతనిపై మరొకొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని స్థానిక ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment