కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విజయేంద్ర సవాలు
సాక్షి బెంగళూరు: తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందని, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపిందని, 50 మంది ఎమ్మెల్యేలను కొనడానికి కుట్రలు చేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించడం సంచలనాత్మకంగా మారింది. సిద్ధరామయ్య ఆరోపణలపై కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే నిరూపించాలని గురువారం సిద్ధరామయ్యకు సవాలు విసిరారు.
ముఖ్యమంత్రి సొంత పార్టీ ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయారని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వడానికి తాము ప్రయత్నించినట్లు నిరూపించకపోతే ప్రజలు ఎప్పటికీ ఆయనను నమ్మరని తేల్చిచెప్పారు. ఉన్నత పదవిలో ఉన్న నాయకుడి ప్రవర్తన కూడా ఉన్నతంగా ఉండాలని హితవు పలికారు.
దర్యాప్తు సంస్థలు ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నాయని, ఆరోపణలను ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు. అయితే, విజయేంద్ర సవాలుపై స్పందించడానికి సిద్ధరామయ్య నిరాకరించారు. మరోవైపు బీజేపీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ సమర్థించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించిన సంగతి నిజమేనని గురువారం చెప్పారు. పలువురు మంత్రులు సైతం సిద్ధరామయ్యకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందందని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment