న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) దశల వారిగా వెల్లడిస్తున్న ఎన్నికల బాండ్ల వివరాల్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్‌బీఐ తాజాగా బాండ్ల నంబర్ల వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందజేసింది. ఈ వివరాలు అందిన వెంటనే ఈసీ వాటిని గురువారం తన వెబ్‌సైట్‌లో ఉంచింది.
ఈ వివరాల ద్వారా ఆయా వ్యక్తులు, సంస్థలు ఏ పార్టీకి విరాళమిచ్చారనేది స్పష్టంగా తేలిపోయింది. వీటిలో సంస్థలు కాకుండా వ్యాపార రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులు తమ వ్యక్తిగత హోదాలో ఇచ్చిన మొత్తం విరాళాలు రూ. 180.2 కోట్లు. ఏప్రిల్ 12,2019 నుంచి జనవరి11,2024 వరకు ఇచ్చిన ఈ విరాళాల్లో సింహభాగం 84.5 శాతం బీజేపీకే వెళ్లడం గమనార్హం.
వ్యక్తిగత విరాళాల్లో రూ.152.2 కోట్లతో బీజేపీ మొదటిస్థానంలో, రూ.16.5 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్ రెండవ స్థానం, రూ.5 కోట్లతో ఈ జాబితాలో భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) మూడవ స్థానంలో నిలిచాయి. వ్యక్తిగతంగా బీజేపీకి రూ.35 కోట్ల విరాళమిచ్చి దాతల జాబితాల్లో ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ తొలి స్థానంలో నిలిచారు. రూ.25 కోట్ల విరాళంతో రిలయన్స్ టాప్‌ర్యాంకు ఉద్యోగి లక్ష్మీదాస్ వల్లభ్‌దాస్ మర్చంట్ రెండవ స్థానంలో నిలిచారు. కాగా, కార్పొరేట్ సంస్ణలు ఎన్నికల బాండ్ల ద్వారా ఇచ్చిన విరాళాల్లోనూ అత్యధికం బీజేపీకే వెళ్లిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment