ఢిల్లీ: బీజేపీ యూటర్న్‌తో ఢిల్లీ మున్సిపల్ మేయర్ పదవికి పోటీ తప్పడం లేదు. ఓటమిని అంగీకరిస్తూనే.. విజయం దక్కించుకున్న ఆప్ అభ్యర్థే మేయర్ పదవి దక్కించుకోబోతున్నారని, తాము పోటీలో నిలవబోమని బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా ప్రకటించిన కొద్దిరోజులకే కమలం పార్టీ గేర్ మార్చింది.
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు అభ్యర్థులను మంగళవారం ప్రకటించింది బీజేపీ. షాలిమార్ బాగ్ బీజేపీ కౌన్సిలర్ రేఖా గుప్తాను మేయర్ అభ్యర్థిగా, రామ్ నగర్ కౌన్సిలర్ కమల్ బాగ్ది లను డిప్యూటీ మేయర్ అభ్యర్థులుగా నిలబెడుతున్నట్లు ప్రకటించింది బీజేపీ. అలాగే ఎంసీడీలో కీలకంగా భావించే స్టాండింగ్ కమిటీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ప్రకటించింది.
250 స్థానాలున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఆప్ 134, బీజేపీ 104 సీట్లు దక్కించుకున్నాయి. పదిహేనేళ్ల తర్వాత బీజేపీయేతర పార్టీకి మేయర్ పదవి దక్కించుకునే అవకాశం దక్కింది. దీంతో ఎన్నికల హామీ ప్రకారం మహిళా కౌన్సిలర్ షెల్లీ ఒబేరాయ్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది ఆప్. అలాగే.. ఆలె మొహమ్మద్ ఇక్బాల్‌ను డిప్యూటీ మేయర్‌గా నిలబెడుతున్నట్లు తెలిపింది. మెజార్టీ స్థానాల ఆధారంగా ఆప్ అభ్యర్థుల గెలుపు దాదాపుగా ఖాయమైనప్పటికీ.. స్టాండింగ్ కమిటీ స్థానాలను ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్, ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ ఎన్నికకు వర్తించకపోవడంతో ఏదైనా జరగవచ్చని ఆశిస్తోంది.
ఇంతకు ముందు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని బీజేపీ ప్రకటించుకుంది. బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా మీడియాకు తెలిపారు కూడా. ఈ నేపథ్యంలో.. ఆప్ అభ్యర్థుల గెలుపు ఖాయమని అంతా భావించారు. కానీ, ఇప్పుడు యూటర్న్ తీసుకుని అభ్యర్థులను బరిలోకి దింపింది బీజేపీ.
మేయర్ పోస్ట్ నామినేషన్‌లకు డిసెంబర్ 27 ఆఖరి తేదీ. జనవరి 6వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. ఢిల్లీ మేయర్‌ను మొత్తం 250 గెలిచిన మున్సిపల్ కౌన్సిలర్లు, ఏడు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ నామినేట్ చేసే 14 మంది ఎమ్మెల్యేలు(13 ఆప్, 1 బీజేపీ) మేయర్‌ను, డిప్యూటీ మేయర్‌ను ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. మేయర్ ఎన్నికలో మొత్తం 274 ఓట్లు ఉంటాయి. ఇప్పటికే ఆప్‌కు 150, బీజేపీకి 113 ఓట్లు అనుకూలంగా ఉన్నాయి.
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ 9, ఇద్దరు స్వతంత్రులు నెగ్గారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది మొదట్లో ఛండీగడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో.. 35 స్థానాలకు గానూ 14 స్థానాలు గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది ఆప్. కానీ, మేయర్ పోస్ట్ మాత్రం బీజేపీకే వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment