సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మహమ్మారి బారినపడి, కోలుకున్నవారిలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లాక్ ఫంగస్ రూపంలో మృత్యువు కాటేస్తోంది. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. బ్లాక్‌ఫంగస్‌గా పిలిచే మ్యూకోర్‌మైకోసిస్ సంక్రమణ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ కనిపిస్తోంది. మహారాష్ట్రలో మ్యూకోర్‌మైకోసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం కనీసం 8 మంది కోవిడ్–19 రోగులు ప్రాణాలు కోల్పోయారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో ఆరుగురు బ్లాక్ ఫంగస్ బారిన పడి చికిత్స కోసం సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు.
గుజరాత్‌లోని సూరత్‌లో కిరణ్ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 50 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం మరో 60 మంది ఎదురు చూస్తున్నారు. ఈ బాధితులంతా ఇటీవలే కోవిడ్ నుంచి బయటపడిన వారే కావడం గమనార్హం. కరోనా చికిత్స సమయంలో రోగికి ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నప్పుడు ఆ కారణంగా ఏర్పడే తేమ వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వారి రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసి ప్రాణాంతకంగా మారుతోందని మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (డీఎంఈఆర్) అధిపతి డాక్టర్ తత్యారావు లాహనే వెల్లడించారు.
రోగి మెదడుకు ఫంగస్ చేరుకుంటే అది ప్రాణాంతకమని స్పష్టం చేశారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు కళ్లలో ఒకటి శాశ్వతంగా తొలగించాల్సి ఉంటుందన్నారు. మ్యూకోర్‌మైకోసిస్ సాధారణ లక్షణాలు తలనొప్పి, జ్వరం, కళ్ల కింద నొప్పి, పాక్షికంగా దృష్టి కోల్పోవడం వంటివి ఉన్నాయని తెలిపారు. ఈ బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఒక్కొక్కటి రూ.9 వేల విలువైన ఇంజెక్షన్లను 21 రోజుల పాటు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment