ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో 14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్‌పై ముంబై హైకోర్టు థాక్రే వర్గానికి, స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి హీటెక్కింది.
వివరాల ప్రకారం.. 2022లో చీలిక తర్వాత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు, సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రతివాదులందరూ తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని గిరీష్ కులకర్ణి, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు.. 2022లో పార్టీ చీలిక తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టాల కింద ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్ వచ్చింది. షిండేతో సహా అధికార వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాక్రే బృందం పిటిషన్‌లో డిమాండ్ చేసింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని షిండే డిమాండ్ చేశారు. అయితే, షిండే వెంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతూ శాసన సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ స్పీకర్ తిరస్కరించారు. శివసేన మొత్తం ఎమ్మెల్యేలు 57 మంది కాగా వారిలో అత్యధికులు (37 మంది) షిండేతో పాటే ఉన్నారని స్పీకర్ నిర్ధారించారు.
ఉద్ధవ్ థాక్రే సవాల్..
ఇదిలా ఉండగా.. ఏది అసలైన శివసేననో బహిరంగ చర్ చద్వారా తేల్చుకుందామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, స్పీకర్ రాహుల్ నర్వేకర్‌లకు ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌పై ఆయన మంగళవారం స్పందించారు. ‘నేను ఈ పోరాటాన్ని ప్రజా కోర్టులోకి తీసుకెళ్తా. ఈ పోరాటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా అనేది తేలుతుంది’ థాక్రే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment