కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీకార్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్య, అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో బాధితురాలి స్నేహితులకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
వైద్యురాలి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆమె నలుగురి స్నేహితుల్ని విచారించారు. విచారణలో వారు చెప్పిన సమాధానాలు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే ఆమె స్నేహితులకు లై డిటెక్టర్ టెస్ట్‌లు నిర్వహించే యోచనలో సీబీఐ అధికారులు ఉన్నారంటూ జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. లై డిటెక్టర్ టెస్ట్‌లో ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్న్‌లు ఉన్నారు. తాజాగా, ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై దారుణం జరగకముందు, జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఆ రాత్రి ఏం జరిగింది?
ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందన్న దానిపై సీబీఐ కీలక సమాచారం సేకరించింది. ఆగస్ట్ 8న అర్ధరాత్రి వేళ బాధిత జూనియర్ వైద్యురాలు, ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్ కలిసి భోజనం చేశారు. అనంతరం సెమినార్ గదికి వారు వెళ్లారు. ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ ఈవెంట్‌ను వీక్షించారు. కాగా, తెల్లవారుజామున 2 గంటలకు, ఇద్దరు సహచరులు డ్యూటీలో ఉన్న వైద్యులు విశ్రాంతి తీసుకునే గదిలోకి వెళ్లారు. బాధితురాలు సెమినార్ గదిలోనే ఉండిపోయింది. సెమినార్ హాల్, డాక్టర్లు విశ్రాంతి తీసుకునే గది, ఇంటర్న్‌ల గది కూడా మూడవ అంతస్తులో దగ్గరగా ఉన్నాయి.
మరోవైపు మరునాడు ఉదయం 9.30 గంటలకు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌లలో ఒకరు బాధితురాలి కోసం వెతికేందుకు వెళ్లాడు. దూరం నుంచి కదలలేని స్థితిలో ఉన్న ఆమె మృతదేహాన్ని చూశాడు. వెంటనే తన సహోద్యోగులకు, సీనియర్ వైద్యులకు అతడు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆసుపత్రి అధికారులకు ఈ సమాచారం అందించారని సీబీఐ అధికారులు తెలుసుకున్నారు.
అయితే వైద్యురాలిపై దారుణం జరిగిన ప్రదేశంలో ఆమె నలుగురి స్నేహితుల్లో ఇద్దరి వేలుముద్రలు లభ్యమవ్వడం.. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారికి లై డిటెక్టర్ చేయాలంటూ సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టు అనుమతి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment