
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కష్టకాలంలో అత్యవసర సేవలందించిన కరోనా వారియర్స్‌ని ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. కరోనా నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకలపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ర్ట రాజధాని ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు వేడుకలను నిర్వహించాలని పేర్కొంది. కరోనా దృష్ట్యా భారీ స్థాయిలో జనం వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని అన్ని రాష్ర్ట ప్రభుత్వాలను కోరింది. స్వాతంత్ర్య వేడుకల్లో నిర్వహించే మార్చ్‌ఫాస్ట్‌కు పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మాస్క్ ధరించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.