దాదర్(మహారాష్ట్ర): ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌ఎంటీ) స్టేషన్‌లో ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ రెస్టారెంట్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతీరోజు సుమారు 350 మందికిపైగా ఈ రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారని, శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 400కు పైనే ఉంటోందని రెస్టారెంట్ సిబ్బంది తెలిపారు. ఈ రెస్టారెంట్‌లో చౌక ధరకు లభించే తినుబండారాలను అందరూ ఆస్వాదిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌కు వచ్చేవారు ముఖ్యంగా పండ్ల రసాలు, మిల్క్ షేక్‌లు, మాంసాహార పదార్థాలను ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్‌లో రూ. 15 విలువ చేసే వడాపావ్ మొదలుకొని అనేక దక్షిణ భారత వంటకాలు, ఉత్తర భారత వంటకాలు, చైనీస్ పదార్థాలను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు శాకాహారం, మాంసాహార పదార్థాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కస్టమర్ల నుంచి వస్తున్న స్పందనను బట్టి త్వరలోనే ముంబై పరిధిలోని కుర్లా టెర్మినస్, కల్యాణ్, నేరుల్, లోణావాలా, ఇగత్‌పురి తదితర ప్రధాన స్టేషన్లలోనూ కోచ్ రెస్టారెంట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ నేపథ్యం..
నేటి ఆధునిక సాంకేతిక యుగంలో అనేకమంది ఇంటి భోజనం కంటే బయట దొరికే చిరుతిళ్లకే అలవాటు పడుతున్నారు. దీంతో నగరంలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లపై, సందుల్లో ఇలా ఎక్కడ చూసినా జనాలు బయట విక్రయించే తినుబండారాలనే ఇష్టపడుతున్నారు. నాణ్యతకు, శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై విక్రయించే చైనీస్, వడాపావ్ స్టాళ్లు నిత్యం జనంతో కిటకిటలాడుతున్నాయి. నేటి యువత, కాలేజీ విద్యార్థులు కొత్తదనానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు గ్రహించిన రైల్వే వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఏకంగా ఓ రైల్వే బోగీనే రెస్టారెంట్‌గా మార్చాలని సంకల్పించింది.
ఆ మేరకు ఓ బోగీని రెస్టారెంట్‌గా మార్చి సీఎస్‌ఎంటీలోని 18వ నంబర్ ప్లాట్‌ఫారం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై నిలబెట్టింది. దీనిలో మొత్తం 10 టేబుళ్లను ఏర్పాటు చేసింది. వాటిలో 40 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు చూసుకొనే కాంట్రాక్టర్ నుంచి రైల్వేకు సంవత్సరానికి రూ. 42.56 లక్షల చొప్పున లైసెన్స్ రూపంలో లభిస్తాయి. ఈ కోచ్ రెస్టారెంట్‌లో ముఖ్యంగా కస్టమర్ల భద్రతకు అధిక ప్రా«ధాన్యతను ఇచ్చారు. ఈ రెస్టారెంట్‌లో 8 అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. ఇందులో కూర్చొని వేడివేడి భోజనం లేదా తినుబండారాలు ఆస్వాదిస్తుంటే నిజంగా రైలులో ప్రయాణిస్తూ తింటున్నామా అనే అనుభూతి కలుగుతోందని పలువురు అంటున్నారు. ఈ రెస్టారెంట్ 24 గంటలపాటు తెరిచి ఉంచడంతో ఉద్యోగులు, వ్యాపారులు తమ వీలును బట్టి రావడానికి సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment