cst railway station
-
రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్
దాదర్(మహారాష్ట్ర): ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) స్టేషన్లో ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ రెస్టారెంట్‌కు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతీరోజు సుమారు 350 మందికిపైగా ఈ రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారని, శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 400కు పైనే ఉంటోందని రెస్టారెంట్ సిబ్బంది తెలిపారు. ఈ రెస్టారెంట్లో చౌక ధరకు లభించే తినుబండారాలను అందరూ ఆస్వాదిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌కు వచ్చేవారు ముఖ్యంగా పండ్ల రసాలు, మిల్క్ షేక్‌లు, మాంసాహార పదార్థాలను ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్లో రూ. 15 విలువ చేసే వడాపావ్ మొదలుకొని అనేక దక్షిణ భారత వంటకాలు, ఉత్తర భారత వంటకాలు, చైనీస్ పదార్థాలను అందుబాటులో ఉంచారు. వీటితో పాటు శాకాహారం, మాంసాహార పదార్థాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కస్టమర్ల నుంచి వస్తున్న స్పందనను బట్టి త్వరలోనే ముంబై పరిధిలోని కుర్లా టెర్మినస్, కల్యాణ్, నేరుల్, లోణావాలా, ఇగత్పురి తదితర ప్రధాన స్టేషన్లలోనూ కోచ్ రెస్టారెంట్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ఇదీ నేపథ్యం.. నేటి ఆధునిక సాంకేతిక యుగంలో అనేకమంది ఇంటి భోజనం కంటే బయట దొరికే చిరుతిళ్లకే అలవాటు పడుతున్నారు. దీంతో నగరంలోని రోడ్లు, ఫుట్‌పాత్‌లపై, సందుల్లో ఇలా ఎక్కడ చూసినా జనాలు బయట విక్రయించే తినుబండారాలనే ఇష్టపడుతున్నారు. నాణ్యతకు, శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై విక్రయించే చైనీస్, వడాపావ్ స్టాళ్లు నిత్యం జనంతో కిటకిటలాడుతున్నాయి. నేటి యువత, కాలేజీ విద్యార్థులు కొత్తదనానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు గ్రహించిన రైల్వే వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఏకంగా ఓ రైల్వే బోగీనే రెస్టారెంట్‌గా మార్చాలని సంకల్పించింది. ఆ మేరకు ఓ బోగీని రెస్టారెంట్‌గా మార్చి సీఎస్ఎంటీలోని 18వ నంబర్ ప్లాట్ఫారం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై నిలబెట్టింది. దీనిలో మొత్తం 10 టేబుళ్లను ఏర్పాటు చేసింది. వాటిలో 40 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ రెస్టారెంట్ నిర్వహణ బాధ్యతలు చూసుకొనే కాంట్రాక్టర్ నుంచి రైల్వేకు సంవత్సరానికి రూ. 42.56 లక్షల చొప్పున లైసెన్స్ రూపంలో లభిస్తాయి. ఈ కోచ్ రెస్టారెంట్లో ముఖ్యంగా కస్టమర్ల భద్రతకు అధిక ప్రా«ధాన్యతను ఇచ్చారు. ఈ రెస్టారెంట్లో 8 అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. ఇందులో కూర్చొని వేడివేడి భోజనం లేదా తినుబండారాలు ఆస్వాదిస్తుంటే నిజంగా రైలులో ప్రయాణిస్తూ తింటున్నామా అనే అనుభూతి కలుగుతోందని పలువురు అంటున్నారు. ఈ రెస్టారెంట్ 24 గంటలపాటు తెరిచి ఉంచడంతో ఉద్యోగులు, వ్యాపారులు తమ వీలును బట్టి రావడానికి సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నారు. -
పంజాబ్ మెయిల్ 107 డెక్కన్ క్వీన్ 90
ముంబై: మన దేశంలోనే అత్యంత దూరం నడిచే ఆ పాత రైలు బండి పంజాబ్ మెయిల్. ఆ రైలు జూన్ 1తో 107 ఏళ్లను పూర్తి చేసుకుంది. ముంబై నుంచి పుణెకు నడిచే డెక్కన్ క్వీన్ 89 ఏళ్లు పూర్తి చేసుకుంది. పంజాబ్ మెయిల్ ఆవిరితో నడిచే రైలు. ముంబై నుంచి పెషావర్ (ప్రస్తుతం పాక్‌లో ఉంది) వరకు నడిచింది. ఈ రైలు సర్వీసు మొదట్లో బ్రిటిషర్ల కోసమే ఉండేది. తర్వాత దిగువ తరగతి వారికీ అందుబాటులోకొచ్చింది. 1930లో ఈ రైలుకి మూడో తరగతి బోగీలను అమర్చారు. 1945లో ఏసీ సౌకర్యం వచ్చింది. ప్రస్తుతం ఈ రైలు విద్యుత్‌పైనే నడుస్తోంది. దేశ విభజనకు ముందు పంజాబ్ మెయిల్ ముంబై నుంచి పెషావర్ వరకు 2,496 కి.మీ. దూరం 47 గంటల్లో వెళ్లేదని సెంట్రల్ రైల్వేకు చెందిన చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సునీల్ చెప్పారు. బ్రిటీష్ ఇండియాలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలు ఇదే. ప్రస్తుతం ఈ రైలు ఫిరోజ్‌పూర్ వరకు నడుస్తోంది. అప్పట్లోనే పంజాబ్ మెయిల్లో బాత్రూమ్, రెస్టారెంట్ కార్, లగేజ్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్ ఉండేవి. ఆరు బోగీలు ఉండే మెయిల్లో 3 ప్రయాణికుల కోసం కేటాయిస్తే మిగతావి ఉత్తరాల రవాణాకు వాడారు. ఈ 3 బోగీల్లో కేవలం 96 మంది ప్రయాణించే వీలుండేది. ఇక డెక్కన్ క్వీన్ రైలు 1930జనవరి 1న ప్రారంభమైంది. పుణె నుంచి ముంబై వరకు నడిచిన ఈ రైలు దేశంలో తొలి డీలక్స్ రైలు. ఈ డెక్కన్ క్వీన్ ఠంచనుగా షెడ్యూల్ టైమ్‌కు నడిచేది. అందుకే ఈ రైల్లో ప్రయాణించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించేవారని సునీల్ వివరించారు. -
షోలాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం
సాక్షి, ముంబై : షోలాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వే యార్డులో నిలిపివున్న రైలులోని ఓ బోగి నుంచి పెద్ద ఎత్తున పొగ బయటకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. హుటాహుటిన యార్డుకు చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. పదుల సంఖ్యలో ఫైర్ మెన్స్ మంటలను అదుపు చేయడంలో నిమగ్నమయ్యారు. రైలులో అగ్నిప్రమాదం జరిగిందన్న వార్త దావనంలా వ్యాపించడంతో ఘటనాస్థలికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
సీఎస్టీలో ఉచిత ‘వైఫై’ సేవలు!
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్లో ఉచితంగా ‘వైఫై’ఇంటర్నెట్ సేవ లు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు తాము వెళ్లాల్సిన రైలు ఎక్కడుంది. ఏ సమయంలో ప్లాట్‌ఫాంకి చేరుకుంటుంది తదితర వివరాలను మొబైల్ఫోన్లో చూసుకునే వెసులుబాటు కలగనుంది. అయితే ఇది కేవలం స్మార్ట్‌ఫోన్, మొబైల్లో వైఫై సౌకర్యం ఉన్నవారికి మాత్రమే ఈ సేవ లు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. సీఎస్టీకి ప్రతి రోజు సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికుల తాకిడి ఉంటుందని, ఈ వైఫై సేవలు వారందరికి ఉచితంగానే అందుతాయని వివరించారు. ఈ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సెంట్రల్ రైల్వే అధికారులు మొబైల్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ‘సీఎస్టీ స్టేషన్లోకి ప్రవేశించగానే ప్రయాణికుల మొబైల్ స్క్రీన్‌పై వైఫై సూచన వస్తుంది. దాని పై క్లిక్ చేసిన అనంతరం మొబైల్లో ఇంటర్నెట్ వస్తుంది. ఆ తర్వాత ప్రయాణికులు ఉచి తంగా ఇంటర్నెట్ సేవను పొందుతార’ని సెం ట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రైల్వే సమయాలు, అలాగే రైళ్ల కచ్చితమైన స్టేషన్ల గురించి ఎప్పటికప్పుడూ తెలియజేయాలనే ఉద్దేశంతో రైల్వే ఇటీవల www. enquiry.indianrail.gov.inవెబ్‌సైట్‌ను ప్రారంభించిందన్నారు. రైళ్ల సమయాలతో పాటు వాటి ప్రస్తుత స్థితి, సమయానికి బయలుదేరుతుందా, ఆలస్యమవుతుందా తది తర సమాచారం ఈ వెబ్సైట్లో తెలుసుకోవచ్చని తెలిపారు. మొబైళ్లలో వినియోగించే ఇతర వెబ్సైట్లలో రైల్వే రూపొందించిన వెబ్సైట్ గురించి ‘పాప్-అప్’ వచ్చేందుకు రైల్వే తరపున సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని తెలిపారు.