
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు అత్యల్పంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు 2.10 శాతంగా ఉందని వ్యాధి నుంచి పెద్దసంఖ్యలో రోగులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం పేర్కొన్నారు. రాష్ట్రాల్లో కరోనా పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయని గడిచిన 24 గంటల్లో 6 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేపట్టామని చెప్పారు. ఇప్పటివరకూ 2 కోట్లకు పైగా కరోనా టెస్టులు జరిగాయని వెల్లడించారు.
ప్రతి పది లక్షల మందిలో 15,000 మందికి పైగా పరీక్షలు నిర్వహించారని తెలిపారు. రికవరీ రేటు 66.31 కాగా, కరోనా పాజిటివిటీ రేటు 11 శాతంగా నమోదైందని తెలిపారు. ఇక కరోనా మరణాల్లో 50 శాతం 60 ఏళ్ల వయసుపైబడిన వారు కాగా, 45-60 ఏళ్లలోపు వారు 37 శాతం ఉన్నారని వెల్లడించారు.మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 18 లక్షల 50 వేలు దాటాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 52,050 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజులోనే మొత్తం 803 మంది మృతిచెందారు. దేశ వ్యాప్తంగా 44,306 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment