సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో! | Chartered Accountancy, Company Secretary, Cost and Management Accounting Courses | Sakshi
Sakshi News home page

సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో!

Published Mon, Mar 29 2021 3:34 PM | Last Updated on Mon, Mar 29 2021 3:39 PM

Chartered Accountancy, Company Secretary, Cost and Management Accounting Courses - Sakshi

చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్‌), కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ(సీఎంఏ).. ఈ మూడు కోర్సులకు.. కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సులుగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది! కెరీర్‌ పరంగా.. ఎంబీఏకు దీటుగా ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు! ఇప్పుడు ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి.. మరో ప్రధానమైన గుర్తింపు లభించింది! అదే.. సీఏ, సీఎస్, సీఎంఏలను.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ తత్సమాన కోర్సులుగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ప్రకటించింది! అంటే.. ఇకపై ఈ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు.. నేరుగా పీజీ అర్హతతో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ స్థాయి హోదాతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం... 

వాస్తవానికి సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులకు పీజీ హోదా కల్పించాలని.. ఆయా కోర్సుల నిర్వాహక సంస్థలు ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ,  ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా.. కొన్ని నెలల క్రితమే యూజీసీకి విజ్ఞప్తి చేశాయి. దాంతో యూజీసీ ఈ కోర్సులకు పీజీ హోదా కల్పించే విషయంపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ కోర్సుల స్వరూపాన్ని,శిక్షణను క్షుణ్నంగా పరిశీలించింది. వీటికి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ హోదా కల్పిం చొచ్చని యూజీసీకి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుకు అనుగుణంగా ఇటీవల యూజీసీ అధికారిక ప్రకటన విడు దల చేసింది. ఈ కోర్సులను పీజీ కోర్సులకు తత్సమాన కోర్సులుగా భావించాలని దేశ వ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లకు లేఖ రాసింది.

పరిశోధనలకు ఊతం
యూజీసీ నిర్ణయంతో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు ఉన్నత విద్య,పరిశోధనల దిశగా అడుగులు వేసేందుకు అవకాశం లభిస్తుంది. ఈ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు యూజీసీ–నెట్‌లో అర్హత సాధించి.. తమకు ఆసక్తి ఉన్న విభాగాల్లో పరిశోధనలు చేసే అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా వీరు కామర్స్, మేనేజ్‌మెంట్, అకౌంటింగ్, ఫైనాన్స్‌ తదితర విభాగాల్లో ఎంఫిల్, పీహెచ్‌డీల్లో చేరొచ్చు. పీజీ అర్హతగా ప్రవేశాలు కల్పించే ఇతర కోర్సుల్లోనూ అవకాశం లభించనుంది.

అంతర్జాతీయంగా అవకాశాలు
సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. వీటి ఉత్తీర్ణులకు అంతర్జాతీయంగానూ కెరీర్, ఉన్నత విద్య పరంగా అవకాశాలు విస్తృతం కాను న్నాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి తాజా నిర్ణయం దోహదపడుతుంది. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో పీజీ ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌ అర్హతగా ఉద్యోగాలు కల్పించే సంస్థల్లో వీరు అడుగు పెట్టేందుకు అవకాశం లభించనుంది. 

ఇప్పటికే ఒప్పందాలు
వాస్తవానికి ఇప్పటికే ఐసీఏఐ,ఐసీఎస్‌ఐ, ద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా.. పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఫలితంగా దాదాపు 80 దేశాల్లో ఈ కోర్సుల ఉత్తీర్ణులకు అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. తాజా నిర్ణయంతో ఇది మరింత విస్తృతం అవుతుంది. అంటే.. ఇకపై వీరు ప్రపంచంలో ఎక్కడైనా పీజీ అర్హతతో లభించే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను అందుకునేందుకు మార్గం ఏర్పడింది. 

కార్పొరేట్‌కు హాట్‌ కేక్‌
సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులు.. స్వదేశంలోనే కార్పొ రేట్‌ సంస్థలకు హాట్‌ కేక్‌లుగా మారుతున్నారు. ప్రధానంగా అకౌంటింగ్, ఫైనాన్స్, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ విభాగాల్లో కీలకమైన హోదాల్లో వీరిని నియమించుకునేందుకు సంస్థలు సిద్ధంగా ఉంటున్నాయి. సదరు ఇన్‌సిట్యూట్‌లతో కలిసి క్యాంపస్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా రూ.లక్షల వార్షిక ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్, కన్సల్టింగ్‌ సంస్థలు.. సీఏ, సీఎస్,సీఎంఏ ఉత్తీర్ణులకు పెద్దపీట వేస్తు న్నాయి. ఐఐఎంలలో మేనేజ్‌మెంట్‌ పీజీ చేసిన వారికి దీటుగా అవకాశాలు, ప్యాకేజీలు అందిస్తున్నాయి.

సర్కారీ కొలువులూ
యూజీసీ తాజా నిర్ణయంతో.. ప్రభుత్వ విభాగాల్లో పీజీ అర్హతతో భర్తీ చేసే పోస్ట్‌లకు కూడా సీఏ, సీఎస్, సీఎంఏ అభ్యర్థులకు అర్హత లభిస్తుంది. ముఖ్యంగా బ్యాం కింగ్‌ రంగంలో ఆర్‌బీఐ, ఇతర బ్యాంకులు పీజీ అర్హతగా భర్తీ చేసే స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు పోటీ పడే అవకాశం కలగనుంది. అదే విధంగా ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్, వరల్డ్‌ బ్యాంక్‌ రీజనల్‌ సెంటర్లు, యూఎన్‌ఓ అనుబంధ విభాగాల్లో.. పీజీ స్థాయి అర్హతతో నియామకాలు జరిపే పోస్ట్‌లకు కూడా వీరు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.

అధ్యాపక వృత్తిలోకి
సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు పీజీ హోదా కల్పించడం వల్ల యూజీసీ నెట్‌కు హాజరయ్యే అవకాశం లభిస్తుంది. ఫలితంగా.. వారు పీహెచ్‌డీతోపాటు  యూనివర్సిటీలు, ఇతర అకడమిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో అధ్యాపక వృత్తిలోకి కూడా ప్రవేశం పొందొచ్చు. దీనిద్వారా యూజీసీ స్కేల్‌ ప్రకారం– నెలకు రూ.60వేలకు పైగా వేతనం పొందే అవకాశం కలగనుంది. 

ఫెలో ప్రోగ్రామ్‌లకు మార్గం
సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో..ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌లైన ఐఐఎంల్లో ఫెలో ప్రో గ్రామ్‌లలో ప్రవేశించేందుకు అర్హత లభించినట్లేనని చెప్పొ చ్చు. వాస్తవానికి ఇప్పటికే దేశంలోని అన్ని ఐఐఎంలు పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల పరంగా సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. వీరు క్యాట్‌కు హాజరయ్యేందుకు కూడా అర్హత లభిస్తోంది. తాజా నిర్ణ యంతో పీజీ ప్రోగ్రామ్‌లే కాకుండా.. ఆపై స్థాయిలో బోధిం చే ఫెలో ప్రోగ్రామ్‌ల్లో సైతం ప్రవేశం పొందే అవకాశం లభించనుంది. ఈ విషయంపై ఐఐఎం వర్గాల నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. 

102 యూనివర్సిటీలు.. పీజీగా గుర్తింపు
ఇప్పటికే దేశంలోని 102 యూనివర్సిటీలు సీఏ, సీఎస్‌ కోర్సులను పీజీ స్థాయికోర్సులుగా గుర్తిస్తున్నాయి. అవి అందించే పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి వీరికి అర్హత కల్పిస్తున్నాయి. అదే విధంగా జాతీయ స్థాయిలో మరో వందకు పైగా అకడమిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లు, ఆరు ఐఐఎంలు, రెండు ఐఐటీలు.. సీఏ, సీఎస్‌ కోర్సులను పీజీకి సమానంగా గుర్తిస్తూ.. పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. తాజా నిర్ణయంతో దేశంలోని అన్ని యూనివర్సిటీలు వీటిని పీజీ కోర్సులకు సమానంగా గుర్తించి.. పీహెచ్‌డీలో చేర్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నిత్యం అప్‌డేట్‌ చేస్తూ
సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల నిర్వాహక ఇన్‌స్టిట్యూట్‌లు నిరంతరం తమ కోర్సులను అప్‌డేట్‌ చేస్తూ.. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు బోధన, శిక్షణ ఇస్తుండటం వల్లే వాటికి పీజీ హోదాను యూజీసీ ప్రకటించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్రెషర్స్‌ నుంచి ప్రాక్టీసింగ్‌ సీఏల వరకు అందరికీ.. ఇండస్ట్రీలోని తాజా మార్పులపై ఓరియెంటేషన్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహి స్తున్నాయి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకున్న డేటా అనలిటిక్స్, డేటాసైన్స్‌ వంటి అంశాల్లోనూ విద్యార్థులకు నైపుణ్యాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇలా ఇండస్ట్రీ రెడీగా విద్యార్థులను తీర్చిదిద్దుతుండటం వల్లే సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులకు పీజీ స్థాయి హోదా లభించిందనే భావన నెలకొంది. 

ప్రయోజనం
యూజీసీ తాజా నిర్ణయంతో ఈ మూడు కామర్స్‌ ప్రొఫె షనల్‌ కోర్సులు చదువుతున్న లక్ష మంది విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి పరంగా విస్తృత ప్రయోజనం చేకూరనుంది. సీఏ ఫైనల్‌ పరీక్షకు దాదాపు 25వేల నుంచి 30వేల మంది హాజరవుతుంటారు. సీఎస్, సీఎంఏ విద్యార్థుల సంఖ్య కూడా దాదాపు అంతే ఉంటుంది. ఉత్తీర్ణ త శాతం కొంత తక్కువగా ఉంటున్నప్పటికీ.. ఒకసారి విజయం సాధించలేని విద్యార్థులు మరోసారి పరీక్షల్లో పాస్‌అవుతున్నారు. మొత్తంగా చూస్తే యూజీసీ తాజా నిర్ణయంతో సీఏ, సీఎస్, సీఎంఏ ఉత్తీర్ణులకు అకడమిక్‌గా, కెరీర్‌ పరంగా మరింత ప్రోత్సాహం లభించినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదా.. ముఖ్యాంశాలు
► ఈ  కోర్సులు పూర్తి చేసుకుంటే పీజీ డిగ్రీతో సమానం.
► దాని ఆధారంగా నెట్‌తోపాటు ఎంఫిల్, పీహెచ్‌డీలో చేరే అవకాశం.
► విదేశీ ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యే ఛాన్స్‌.
► పీజీ అర్హతతో ఉండే ఉద్యోగాలకు పోటీ పడే వీలు.
► ఆర్‌బీఐ, ఐఐఎంలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఫెలోషిప్‌నకు మార్గం.
► దాదాపు లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనకరంగా యూజీసీ నిర్ణయం.

విద్యార్థులకు ఎంతో మేలు
యూజీసీ తాజా నిర్ణయం సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సులు చదువుతున్న ఎందరో విద్యార్థులకు ప్రయోజన కరంగా నిలుస్తుంది. వారు నెట్‌ ద్వారా పరిశోధనలో పాల్గొనే అవకాశాలు పొందడమే కాకుండా.. విభిన్న కెరీర్స్‌ అందుబాటులోకి వస్తాయి. పీజీ హోదాతో విద్యార్థులు కూడా ఆయా కోర్సులు పూర్తి చేసేందుకు మరింత చురుగ్గా, కష్టపడి చదువుతారు. నిబద్ధతతో తక్కువ వయసులోనే ఉన్నత అవకాశాలు అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేసే వీలుంది. 
– అభిషేక్‌ మురళి, సెక్రటరీ, ఐసీఏఐ–ఎస్‌ఐఆర్‌సీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement