
రాయ్‌పూర్: పోలీసు వ్యవస్థను సామాన్య ప్రజలకు చేరువ చేసేందుకు 'సమాధాన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు, అందులో భాగంగా సామాన్య ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోని తీసుకొచ్చినట్లు చత్తీస్‌ఘడ్ డీజీపీ అవస్తి వెల్లడించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించే విధంగా ఈ వాట్సాప్ నంబర్‌ను ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను డీజీపీ ఆఫీసు సిబ్బంది స్వయంగా పర్యవేక్షిస్తారని ఆయన వెల్లడించారు.
అయితే ఫిర్యాదులను నేరుగా వాట్సాప్ నంబర్‌ను కాకుండా తొలుత సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదు చేసేందుకు కృషి చేయాలని, అక్కడ సరైన స్పందన లేకుంటే వాట్సాప్ చేయాలని సూచించారు. పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో స్థానికంగా ఎదురయ్యే ఒత్తిళ్ల కారణంగా కొందరు పోలీసులు ఫిర్యాదులను స్వీకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయని, అటువంటి పరిస్థితుల్లో బాధితులు నేరుగా ఈ నంబర్‌కు వాట్సాప్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చని డీజీపీ పేర్కొన్నారు. సామాన్య ప్రజలతో సరిగా వ్యవహరించని పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రంలో పోలీసులు ఈ రకమైన ఆలోచనతో ముందుకు రావడం హర్షనీయమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment