
చెన్నై: తన ఆటోలో మరిచిపోయిన ప్రయాణికుడి ఇరవై లక్షల విలువైన నగల బ్యాగ్‌ను తిరిగి అతనికి ఇచ్చి నిజాయితీ చాటుకున్నాడు తమిళనాడు ఆటోడ్రైవర్ శ్రావణ్ కుమార్. పాల్ అనే ప్రయాణికుడు బంధువుల వివాహవేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో శ్రావణ్ ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కినప్పటి నుంచి సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న రకరకాల బ్యాగుల్లో ఒక బ్యాగ్ వెనక్కి పడిపోయింది. సెల్‌ఫోన్‌లో బిజీగా ఉన్న పాల్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఆటో దిగి వెళ్లిపోయాడు. చాలాసేపటి తరువాత ఆటోలో ఒక మూలకు పడి ఉన్న నగల బ్యాగ్‌ను చూశాడు డ్రైవర్ శ్రావణ్.
ప్రయాణికుడి పేరు ఏమిటో తెలియదు, ఇల్లు ఎక్కడో తెలియదు... బ్యాగ్‌ను తిరిగి ఎలా అందించాలి? అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు శ్రావణ్. మరోవైపు పాల్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆటోను ట్రేస్ చేయమని కోరాడు. అయితే పోలీసులకు ఆ అవసరం రాలేదు. ఈ లోపే శ్రావణ్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నగల బ్యాగ్‌ను అందించాడు, శ్రావణ్ నిజాయితీని మెచ్చుకొని అతనికి బొకే ఇచ్చారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment