చెన్నైలో రౌడీలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు మాస్టర్‌ ప్లాన్‌! | Chennai: Police Ready To Encounter To Eradicate Rowdyism? | Sakshi
Sakshi News home page

చెన్నైలో రౌడీలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు మాస్టర్‌ ప్లాన్‌!

Published Thu, Mar 10 2022 8:19 PM | Last Updated on Thu, Mar 10 2022 8:45 PM

Chennai: Police Ready To Encounter To Eradicate Rowdyism? - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్న: చెన్నై మహానగరంలో పెచ్చుమీరి పోతున్న రౌడీల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు పోలీస్‌ యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఎగస్ట్రాలు చేస్తే ఎన్‌కౌంటర్‌కూ వెనుకాడకూడని నిర్ణయించినట్లు సమాచారం. చెన్నై ప్రజలను వణికించిన అయోద్దికుప్పన్, వీరమణి సహా పలువురు బడా రౌడీలను తుపాకీ తూటాలతో పోలీసులు మట్టుబెట్టారు. ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతున్నా.. కొత్త రౌడీలు పుట్టగొడుగుల్లా పుట్టుకుని వస్తూనే ఉన్నారు. వారిని అణిచివేసే చర్యలు చేపట్టడం పోలీసులకు దిన చర్యగా మారింది. పిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతూ చాలా మంది యువకులు రౌడీలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్నారు.

ఆ ఘటనతో అప్రమత్తం.. 
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చెన్నై మడిపాక్కంలో డీఎంకే నేత సెల్వంను చుట్టుముట్టి కిరాతకంగా హతమార్చిన నిందితులంతా 20 ఏళ్లలోపు వారే కావడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనతో మరింత అప్రమత్తమైన ఖ>కీలు..  చెన్నై పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ ఆదేశాల మేరకు నగరంలోని వెయ్యిమందికి పైగా రౌడీల జాబితాను  సిద్ధం చేశారు. వీరి నేర చరిత్రను బట్టి ఏ ప్లస్, ఏ, బీ, సీ లుగా విభజించారు.  అంతేగాక అజ్ఞాతంలో ఉన్నవారు, ఇటీవలే జైలు నుంచి విడుదలైన రౌడీల జాబితా, వారి నేర చరిత్రపై పూర్తి వివరాలను సేకరించాలని సూచించారు. నేర ప్రవృత్తికి దూరంగా మెలుగుతూ జీవనం సాగించకుండా, పోలీస్‌ హెచ్చరికలను ఖాతరు చేయకుండా హద్దుమీరే వారిని ఎన్‌కౌంటర్‌  ద్వారా హతమార్చవచ్చని ఇన్‌స్పెక్టర్లకు పోలీస్‌ కమిషనర్‌ పూర్తి అధికారాలను ఇచ్చేసినట్లు విశ్వసనీయమైన సమాచారం.

ఇందుకు సంబంధించి పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ, చెన్నై నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అత్యంత కఠినమైన చర్యలను అమలు చేయనున్నామని తెలిపారు. రౌడీల అణచివేతతోపాటూ, రౌడీలకు ఆశ్రయం ఇచ్చినా, నేరాలకు సహకరించినా, పారిపోయేందుకు తోడ్పడినా.. అలాంటి వారిపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. సాధారణ, పేరొందిన రౌడీలతోపాటూ 325 మంది బడా దాదాలను కూడా గుర్తించామని అన్నారు. వీరంతా సమష్టిగా నేరాలకు పాల్పడుతూ గ్యాంగ్‌స్టర్‌లుగా చలామణి అవుతున్నట్లు నిర్ధారణ కావడంతో వీరిని ప్రత్యేక జాబితాలో చేర్చామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement