
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చెన్నై: స్కూటర్‌పై వెళ్తున్న ఓ మహిళ ఫ్లెక్సీ రూపంలో ప్రాణాలు కోల్పోయారు. పుదుకోట్టై జిల్లా తిరుబువనం సమీపంలోని కరంపకుడి అమ్మనిపేటకు చెందిన స్వామికన్ను భార్య విజయరాణి మేల్‌మెట్టనూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగుపయనంలో ఎంతకు బస్సు రాకపోవడంతో అటు వైపు స్కూటర్‌లో వచ్చిన యువకుడ్ని లిఫ్ట్ అడిగారు. అతడు లిఫ్ట్ ఇవ్వడంతో ఇద్దరు స్కూటర్‌పై అమ్మని పేటకు బయలుదేరారు.
మార్గ మధ్యంలో ఓ చోట రవిచంద్రన్ అనే వ్యక్తి తన తండ్రి మరణించడంతో నివాళులర్పించే రీతిలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఉండడం, అది గాలికి స్కూటర్‌పై పడడం చోటుచేసుకుంది. స్కూటర్ వెనుక ఉన్న విజయరాణిపై ఫ్లెక్సీ పడడంతో ఆమె రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తరలించగా మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం చెన్నైలో అన్నాడీఎంకే వర్గాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పడి రోడ్డుపై స్కూటర్‌లో వెళ్తున్న ఓ యువతి మరణించిన విషయం తెలిసిందే.