గువాహటి: కరోనా వైరస్ వల్ల ప్రపంచమే కుదుపుకు లోనైంది. అందులో పేదవారి జీవితాలు మరింత అస్తవ్యస్తమయ్యాయి. సాధారణ సమయాల్లో ఏ పూటకి ఆ పూట అన్న విధంగా ఉండే కొన్ని జీవితాల్లో కరోనా శోకాన్నే తీసుకొచ్చింది. ఒక్కసారిగా పడ్డ కోవిడ్-19 పిడుగుతో పిడికెడు మెతుకులు దొరకని పరిస్థితి. ఈ సమయంలో తల్లిదండ్రుల కోసం పిల్లలు ముందుకొచ్చారు. పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు పనుల్లోకి దిగుతున్నారు. వీపుపై బ్యాగు మోయాల్సిన పసికూనలు సామాన్లు మోస్తూ శ్రమకు మించిన పని చేస్తున్నారు. విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్లాసులంటారా.. అవి ఫోన్లు, అందులో ఇంటర్నెట్ ఉన్నవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండే చదువులు. (పలకాబలపం వదిలి.. పలుగూపారా..)
ఈ విషయం గురించి అస్సాంలోని గువాహటిలో హఫీజ్‌నగర్ బస్తీలో నివసించే పదహారేళ్ల జంషేర్ అలీ మాట్లాడుతూ "లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత పాఠశాలలు ప్రారంభమవుతాయి. అప్పుడు తప్పకుండా తిరిగి పాఠశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తా. నాకు చదువును వదులుకోవాలని లేదు, కానీ రోజూ వారీ కూలీగా మారిన నేను పనిని కూడా వదిలిపెట్టలేను. ఎందుకంటే మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. పని కూడా చేయట్లేదు. నేను రోజూ కూలీకి వెళ్లడం వల్ల కనీసం రూ.200-300 సంపాదించగలుగుతున్నాను. ఈ డబ్బుతోనే సర్దుకుపోతున్నా. విద్య ఎంత అవసరమో నా కుటుంబానికి తిండి పెట్టడం అంతే అవసరం" అని చెప్పుకొచ్చాడు. "నేను కొన్ని ఇళ్లల్లో పనిమనిషిగా చేసేదాన్ని. కానీ కోవిడ్ వ్యాప్తి ప్రారంభం అవగానే నన్ను పనిలో నుంచి తీసేశారు. అసలే అనారోగ్యంతో ఉన్న నేను, నా కొడుక్కి ఒక్కపూట అయినా తిండి ఎలా పెట్టగలను?" అని అలీ తల్లి మొమినా ఖతున్ తెలిపారు. (బాల్యం బుగ్గిపాలు!)
"ఆన్‌లైన్ క్లాసులు మాకు అందని ద్రాక్ష. అసలు ఫోన్లే లేని మేము వాటిని ఎలా వినియోగించుకుంటాం?", "మా తల్లి మాకోసం పని చేసేది. ఇప్పుడు ఆమె కోసం మేము పని చేస్తున్నాం" అంటున్నారు అలీ స్నేహితులు సమద్, సైఫుల్. వీళ్లే కాదు, ప్రస్తుతం ఎంతోమందిది ఇదే పరిస్థితి. హఫీజ్‌నగర్‌లోని ఏ బస్తీని కదిలించినా ఇలాంటి గాథలే కనిపిస్తాయి. ఇక్కడ నివసించే పిల్లల్లో మూడో వంతు ఆదాయం కోసం పనిబాట పడుతున్నారు. 14-17 ఏళ్లు ఉన్న పిల్లలు పరిశుభ్రత కార్మికులుగా, కూరగాయలు అమ్మేవారిగా, వారి సహాయకులుగా పని చేస్తూ నెలకు రూ.1000 నుంచి 3 వేలు సంపాదిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలోని ప్రతి 100 మంది పిల్లల్లో 14 మంది బాల కార్మికులుగా ఉన్నారు. కరోనా కాటు వల్ల ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. (పెళ్లి చేసుకో, పిల్లల్ని కను.. అప్పుడే)
Comments
Please login to add a commentAdd a comment