ఢిల్లీలో 10 వేలకు పైగా పడకలతో సిద్ధంచేసిన కోవిడ్ కేర్ సెంటర్
న్యూఢిల్లీ : దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఒకే రోజు అత్యధికంగా 17,296 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,90,401కి చేరుకుంది. మొత్తం కేసుల్లో సగానికి పైగా 10 నగరాలు, జిల్లాల నుంచే వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీ, చెన్నై, థానే, ముంబై, పాల్‌గఢ్, పుణె, హైదరాబాద్, రంగారెడ్డి, అహ్మదాబాద్, ఫరీదాబాద్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో 54.47 శాతం జూన్ 19 నుంచి 25 మధ్య నమోదయ్యాయి. ఇక 24 గంటల్లో 407 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 15,301కి చేరుకుంది. రికవరీ రేటు 58 శాతానికి పెరగడం ఊరటనిస్తోందని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
కరోనాకూ రాజధానే
కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ విలవిల్లాడుతోంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఢిల్లీలో 3,390 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ముంబైని మించిపోయి 73,780కి చేరుకున్నాయి. ముంబైలో ఏప్రిల్ నెలలో విపరీతంగా కేసులు నమోదైతే , ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్నాళ్లుగా ప్రతీరోజూ వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. కరోనా కేసులు ఢిల్లీలో 12 రోజుల్లోనే రెట్టింపైతే, ముంబైలో 40 రోజులకి, చెన్నైలో 19 రోజులకి డబుల్ అయ్యాయి. జూన్ 24 నాటికి ముంబైలో మరణాల రేటు 5.7%గా ఉంటే ఢిల్లీలో 3.36%, చెన్నైలో 1.46%గా ఉంది.
కాంగ్రెస్ నేత అభిషేక్‌కు కరోనా
కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మనుసింఘ్వీకి కరోనా సోకింది. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్టుగా ఆయన సన్నిహితులు శుక్రవారం వెల్లడించారు. ఆయనకు స్వల్పంగా జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలకు వెళ్లారు. సింఘ్వీ భార్యకు కూడా కోవిడ్–19 సోకింది.
గువాహటిలో 14 రోజుల లాక్‌డౌన్
కోవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో గువాహటి జిల్లాలోని కామ్‌రూప్ (మెట్రో)లో జూన్ 28 అర్ధరాత్రి నుంచి 14 రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లోకి రానుందని అస్సాం ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట 12 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు.
కరోనా ఆస్పత్రిగా మసీదు
దేశంపై కరోనా పంజా విసిరిన వేళ ముస్లింలు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలోని శాంతి నగర్ ప్రాంతంలో మసీదుని కోవిడ్ రోగులకు చికిత్సనందించడానికి వీలుగా మార్చారు. ఆక్సిజన్ సిలండర్లు, ఇతర వైద్య పరికరాలతో 5 పడకలను ఏర్పాటు చేయడమే కాదు, స్వల్ప లక్షణాలున్న వారికి 70 మంది వరకు చికిత్స చేసేలా సదుపాయాలు కల్పించారు. మతంతో ప్రసక్తి లేకుండా ఎవరు వచ్చినా చికిత్స అందిస్తామని మసీదుని నిర్వహిస్తున్న జమాత్–ఏ–ఇస్లామీ హింద్ ప్రతినిధులు స్పష్టం చేశారు. భివాండీ మున్సిపాల్టీలో 1,332 కేసులు నమోదైతే మృతుల రేటు 5.26 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment