సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అమలైన లాక్‌డౌన్ సానుకూల ఫలితం ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 750 పాజిటివ్ కేసుల నుంచి అవి రెట్టింపవుతూ వచ్చిన వ్యవధిపై ఆ శాఖ గణాంకాలను విశ్లేషిస్తే మన దేశంలో కేసులు రెట్టింపవడానికి కనిష్టంగా నాలుగు రోజుల నుంచి గరిష్టంగా ఆరు రోజులు పట్టగా.. కొన్ని దేశాల్లో కనిష్టంగా ఒక రోజే ఉండడం గమనార్హం. మన దేశంలో 750 కేసుల నుంచి 1,500 కేసులకు చేరడానికి నాలుగు రోజులు పట్టగా.. 1,500 నుంచి 3,000లకు చేరడానికి నాలుగు రోజులే పట్టింది.
3,000 కేసుల నుంచి 6 వేలకు చేరడానికి 5 రోజులు పట్టగా.. 6 వేల నుంచి 12 వేలకు చేరడానికి 6 రోజులు పట్టింది. అయితే అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో తక్కువ సమయంలోనే కేసులు రెట్టింపు సంఖ్యకు చేరాయి. అమెరికాలో 750 నుంచి 1500లకు చేరడానికి రెండు రోజులు, 1500 నుంచి 3 వేలకు చేరడానికి 3 రోజులు, 3 వేల నుంచి 6 వేలకు చేరడానికి 2 రోజులు, 6 వేల నుంచి 12 వేలకు చేరడానికి 2 రోజులు పట్టిందని తెలిపింది. ఇటలీలో కేసుల రెట్టింపునకు కనిష్టంగా 2 రోజులు, గరిష్టంగా 4 రోజులు పట్టింది. స్పెయిన్‌లో కనిష్టంగా ఒక రోజు, గరిష్టంగా 4 రోజులు పట్టింది. కెనడాలో కనిష్టంగా 2 రోజులు, గరిష్టంగా 5 రోజులు పట్టింది.
పది లక్షల జనాభాకు 9 కేసులు
దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 9 కేసులు నమోదవగా స్పెయిన్‌లో అత్యధికంగా ఈ సంఖ్య 3,864గా ఉంది. ఇటలీలో 2,732గా, ఫ్రాన్స్‌లో 2,265గా, అమెరికాలో 1,946గా ఉంది. జర్మనీలో ప్రతి పది లక్షల జనాభాకు 1,608 కేసులు, యూకేలో 1,451 కేసులు, కెనడాలో 752 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ సగటు 267గా ఉంది.
పది లక్షల జనాభాకు 0.3 మరణాలు
దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు 0.3 మరణాలు సంభవించాయి. స్పెయిన్‌లో గరిష్టంగా ప్రతి పది లక్షల జనాభాకు 402 మంది చనిపోయారు. ఇటలీలో ఈ సంఖ్య 358గా ఉంది. ఫ్రాన్స్‌లో 263, యూకేలో 190, అమెరికాలో 86గా ఉంది. జర్మనీలో 45, కెనడాలో 27, ప్రపంచ సగటు 17.3గా ఉంది.
టెస్టుల సంఖ్య ఎక్కువగానే..
మన దేశంలో 5 వేల పాజిటివ్ కేసులు తేలేసరికి మొత్తం 1,14,015 టెస్టులు పూర్తయ్యా యి. 10 వేల పాజిటివ్ టెస్టులు నమోదయ్యేనాటికి 2,17,554 టెస్టులు పూర్తయ్యాయి. దేశంలో ఇప్పటివరకు సగటు ప్రతి 22 టెస్టుల్లో ఒకటి పాజిటివ్‌గా తేలిందని ఐసీఎంఆర్ తెలిపింది. అమెరికాలో తొలి 5 వేల పాజిటివ్ కేసులు తేలేనాటికి కేవలం 1,04,073 టెస్టులు పూర్తయ్యాయి. 10 వేల పాజిటివ్ కేసులు తేలేనాటికి 1,39,878 టెస్టులు పూర్తయ్యాయి. అంటే మన దేశంలో టెస్టుల సంఖ్య మెరుగ్గా ఉంది. యూకే, ఇటలీలో టెస్టుల సంఖ్య తక్కువగా ఉంది. కెనడాలో తొలి 5 వేల పాజిటివ్ కేసులు తేలేనాటికి 2,41,138 టెస్టులు చేశారు. పది వేల కేసులు చేరేనాటికి 2,95,065 టెస్టులు చేశారు. మొత్తంగా కెనడాలో, ఇండియాలో టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment