
గువాహటి: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న సమయంలోనే.. మత ప్రబోధకుడి అంత్యక్రియలకు వేలాదిగా జనం హాజరుకావడంతో అస్సాం ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ఘటన జరిగిన చుట్టుపక్కల మూడు గ్రామాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. ఆల్ ఇండియా జమాయిత్ ఉలేమా ఉపాధ్యక్షుడు, ఈశాన్య రాష్ట్రాల అమిర్–ఇ–షరియత్ అయిన ఖైరుల్ ఇస్లాం(87)అంత్యక్రియలు ఈ నెల 2వ తేదీన జరిగాయి. ఖైరుల్ ఇస్లాం కుమారుడు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన అమినుల్ ఇస్లాం నగౌన్ జిల్లా ధింగ్ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా. తన తండ్రి అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా అంత్యక్రియలకు 10 వేల మందికి పైగా హాజరుకావడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ పరిసరాల్లో ఉన్న 3 గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్‌డౌన్ ప్రకటించారు.
కేరళలో కోవిడ్–19 ఆంక్షలు మరో ఏడాది
తిరువనంతపురం: కోవిడ్–19కు సంబంధిం చిన ఆంక్షలు మరో ఏడాది పాటు అమల య్యేలా కేరళ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 27వ తేదీ నుంచి అమలవుతున్న ఆదేశాలకు తోడుగా మరో ఏడాది పాటు కొనసాగేందుకు వీలు కల్పించేలా కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్– 2020కి అదనపు నిబంధనలను జోడించింది. అవి.. మరో ఏడాది పాటు పెద్ద సంఖ్యలో జనం గుమికూడటంపై నిషేధం కొనసాగు తుంది. బహిరంగ ప్రదేశాల్లో అన్ని సమ యాల్లో ఆరడుగుల భౌతికదూరం పాటిం చాలి. రహదారులు, కాలిబాటలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.