కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో రోజురోజుకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయంగానే కాకుండా శాసనపరంగా కూడా ఆ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా శుక్రవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సంప్రదాయానికి భిన్నంగా సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలయ్యాయి. దీనికి తోడు ఆర్థిక మంత్రి కాకుండా ముఖ్యమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయడం పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.
సాధారణంగా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ ప్రసంగం ఉండాలి. కానీ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను ఆహ్వానించకపోవడం.. ఆర్థిక మంత్రి అమిత్ మిత్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని చెప్పి సీఎం స్థాయిలో మమత బడ్జెట్ ప్రసంగం చేశారు. దీదీ చర్యపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. గవర్నర్ ప్రసంగం ఏది, ఆర్థిక మంత్రి ఎక్కడ, మీరెందుకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని చెప్పి నిరసనకు దిగారు. అవేవి పట్టించుకోకుండా మమత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ‘జై శ్రీరామ్’ నినాదాలు చేస్తూ సమావేశాలను బహిష్కరించారు.
ప్రజాస్వామ్యం వ్యవస్థలో చట్టాలు చేసే కీలకమైన శాసనసభలో మతపరమైన నినాదాలు చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. బీజేపీ ఎమ్మెల్యేల తీరును ఖండించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రానుండడంతో రూ.2.99 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మమత సర్కారు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే రాష్ట్రంలో టీఎంసీ అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రి మమత వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment