
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. దీని ప్రభావం సామాన్యులపై కూడా కనిపించనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.39 పెరిగింది. దీంతో ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర రూ.1,691.50గా మారింది. అయితే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ కొత్త ధర రూ.1802.50గా, ముంబైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1644గా, చెన్నైలో కమర్షియల్ సిలిండర్ కొత్త ధర రూ.1855కి చేరింది. గత జూలై ఒకటిన వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగించేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. జూలై ఒకటిన 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.30 తగ్గింది.
ప్రతి నెల ప్రారంభంలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలలో చోటుచేసుకుంటున్న సర్దుబాట్లు మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు, పన్నుల విధానాలు , సరఫరా, డిమాండ్ వంటి వివిధ అంశాలు ఈ ధర నిర్ణయాలలో కీలకంగా ఉంటాయి.