నాలుగు కొత్త లేబర్ కోడ్స్ త్వరలో అమలులోకి రానున్నాయి. గతంలో వాయిదా వేసిన నాలుగు లేబర్ కోడ్స్ అమలును తిరిగి తీసుకొనిరావడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ వాయిదా పడటానికి ప్రధాన కారణం వీటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడమే అని కేంద్రం ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలను ఆయా రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ చట్టాలను ఆమోదించాయి. ప్రస్తుత సమాచార ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా, పంజాబ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు మాత్రమే వీటిని ఆమోదించాయి.
దేశంలో ఇప్పటి వరకు అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కలిపి నాలుగు లేబర్ కోడ్లగా తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. సామాజిక భద్రతకు సంబంధించిన సోషల్ సెక్యురిటీ కోడ్, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన ఆక్యుపెషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్‌లను పార్లమెంట్ 2020లో ఆమోదించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్రం గతంలో పేర్కొంది. అయితే.. వేజ్ కోడ్ మాత్రం ఉద్యోగుల్లో పెద్ద చర్చకు దారితీసింది. కొత్త నిబంధన ప్రకారం.. మొత్తం శాలరీలో మూలవేతనం కనీసం 50 శాతంగా ఉండాలి. దీంతో.. ఉద్యోగుల భవిష్యనిధికి కేటాయించే మొత్తం పెరగడంతో పాటూ కొన్ని వర్గాల వారికి ట్యాక్స్ భారం పెరిగి చేతికి అందే మొత్తంలో కోత పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment