దేవరజీవనహళ్లి పోలీస్ స్టేషన్ ముందు అల్లర్లలో కాలిపోయిన వాహనాలు
ఎమ్మెల్యే సమీప బంధువైన యువకుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్ మూకదాడులకు కారణమైంది. వేలాది మంది పోలీస్‌స్టేషన్, ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి విధ్వంసకాండకు పాల్పడ్డారు. ఐటీ సిటీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ అల్లర్లు పెను ప్రకంపనలను సృష్టిస్తున్నాయి.
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నడిబొడ్డున పులకేశినగర నియోజకవర్గం కాడుగొండన (కేజీ) హళ్లి, దేవరజీవన (డీజే) హళ్లిలో దావాగ్నిలా అల్లర్లు, హింస చెలరేగాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ఘటనలో 60 మంది పైగా పోలీసులు గాయపడ్డారు. సుమారు 145 మందిని అదుపులోకి తీసుకున్నారు.
భారీగా ఆస్తినష్టం
దాడుల్లో 26 ఇళ్లు దెబ్బతిన్నాయి. రెండు ఆటోలు, మూడు కార్లు, 40 పైగా ద్విచక్రవాహనాలు కాలిపోయాయి. దాడుల్లో ఏటీఎం పగలగొట్టారు. ఉన్నత స్థాయి పోలీసు అధికారుల కార్లకు కూడా నిప్పు పెట్టారు. ఇక పోలీసుల కాల్పుల్లో పది మంది వరకూ గాయపడ్డారు. ఆస్తినష్టం కోట్ల రూపాయల్లో ఉండవచ్చని అంచనా.
ఎలా మొదలైందంటే
పులకేశినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి మేనల్లుడయ్యే నవీన్ అనే యువకుని ఫేస్‌బుక్ ఖాతాలో మంగళవారం సాయంత్రం అనుచితమైన పోస్టింగ్‌లు వచ్చాయి. దీంతో కొందరు మైనారిటీ వర్గాల యువకులు మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో డీజే హళ్లి పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు. అవహేళనగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. ఇంతలో వేలాది మంది అక్కడికి చేరుకుని పోలీస్‌స్టేషన్‌లోని వాహనాలకు నిప్పు పెట్టి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. కొన్ని గంటలపాటు ఈ తతంగం కొనసాగింది. పోలీసులు కూడా అదుపు చేయలేక తలోదిక్కుకు పరుగులు తీశారు. మరికొందరు పోలీసులు స్టేషన్‌లోపల దాక్కున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు భస్మీపటలం అయ్యాయి. ఆ వీధిలో ఉన్న ప్రజల వాహనాలు, ఇళ్లను కూడా వదిలిపెట్టలేదు. కార్లు, బైక్‌లు బూడిదయ్యాయి.
తరువాత ఎమ్మెల్యే ఇంటిపైకి
ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి అండతోనే నవీన్ ఇలా చేస్తున్నాడని భావించి కావల్ బైరసంద్రలోని ఎమ్మెల్యే నివాసంపై దాడికి దిగారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టగా.. ఇళ్లంతా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే గానీ, కుటుంబం కానీ లేకపోవడంతో ముప్పు తప్పింది. కానీ అక్కడ కూడా భారీ విధ్వంసమే చోటుచేసుకుంది. అల్లరిమూకల్ని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరపగా ముగ్గురు యువకులు మరణించారు. అల్లర్లలో 60 మంది వరకూ పోలీసులు గాయపడ్డారు. కాగా అల్లర్లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప ప్రకటించారు.
పోలీసుల అదుపులో పాషా
ఎస్‌డీపీఐ (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) సంస్థ ఆధ్వర్యంలోనే దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్‌డీపీఐ బెంగళూరు నేత ముజామిల్ పాషాను పోలీసులు అరెస్టు చేశారు. అతడే మొదటి నిందితుడని డీజే హళ్లి పోలీసులు పేర్కొన్నారు. ఘటన జరుగుతున్న సమయంలో అతడు మైక్ పట్టుకుని గుంపునుద్దేశించి మాట్లాడుతున్న దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. పాషాపై డీజే హళ్లి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ఐదు కేసులు ఉన్నాయి. సీసీ కెమెరాల చిత్రాలు, సోషల్ మీడియాలో వస్తున్న చిత్రాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పులకేశినగరలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment