సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలను ఫేస్‌బుక్ చూసీచూడనట్లుగా వదిలేస్తోందనే వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం సృష్టించిన రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. విద్వేష కంటెంట్‌ను నిరోధించేందుకు ఫేస్‌బుక్ ఎలాంటి చర్యలు తీసుకుందో వివరణ కోరుతూ ఎఫ్‌బీ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్‌కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫేస్‌బుక్ ఖాతాదారులున్న భారత్‌లో హింసను ప్రేరేపించేలా ఉన్న ప్రసంగాలను ఫేస్‌బుక్ నియంత్రించడం లేదంటూ గత పక్షం రోజుల్లో కాంగ్రెస్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే వాట్సాప్ సంస్థను కూడా బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సంతకంతో కూడిన కాంగ్రెస్ లేఖ స్పష్టం చేసింది. ప్రాణాలను పణంగా పెట్టి నెలకొల్పిన విలువలు, హక్కులకు పాతరవేయడంలో ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగానే భాగస్వామిగా మారిందని, అయితే ఇప్పటికీ దిద్దుబాటు చర్యలకు సమయం మించిపోలేదని జుకర్‌బర్గ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. హేట్ స్పీచ్ పాలసీకి విరుద్ధంగా భారత్‌లో పాలక బీజేపీకి ఫేస్‌బుక్ దాసోహమైందని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. (ఫేస్‌బుక్‌ను బీజేపీ నియంత్రిస్తోంది: రాహుల్)
ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్‌లతోసహా చాలా దేశాల్లో ఫేస్‌బుక్ నిర్వహణ తీరుపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటీవల ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక భారత్‌లో ఫేస్‌బుక్ వ్యవహారశైలిపై ప్రచురించిన కథనం పెద్ద దుమారం రేపింది. ఎఫ్‌బీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంఖిదాస్, మరికొందరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఈ కథనంలో ప్రచురించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిందిగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫేస్‌బుక్ పాలసీ చీఫ్(భారత్) అంఖి దాస్‌పై కేసుపై నమోదైంది. ఇక భారత్‌లో ఫేస్‌బుక్ నియంత్రణపై కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. (బీజేపీకి వత్తాసు : ఫేస్‌బుక్ క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment