![Congress Bharat Jodo Yatra: Rahul Gandhi On Hate Politics - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/13/Rahul_Gandhi_Hate_politics_.jpg.webp?itok=OqrtBbsV)
తిరువనంతపురం: విద్వేషం, హింసతో ఎన్నికల్లో విజయం సాధించవచ్చు తప్ప వాటితో దేశం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలను ఎంతమాత్రం పరిష్కరించలేమని, కొత్త ఉద్యోగాలు సృష్టించలేమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికార బీజేపీ ఈ విషయాన్ని నిరూపించిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో సోమవారం రెండో రోజుకు చేరుకుంది. రాహుల్ గాంధీ తిరువనంతపురం జిల్లాలోని వెల్లాయానీ జంక్షన్ నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. భారీ సంఖ్యలో జనం ఆయన వెంట యాత్రలో పాలుపంచుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. రాహుల్ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశి థరూర్, కేసీ వేణుగోపాల్, కె.సుధాకరన్, సతీశన్ తదితరులు ఉన్నారు. కళాకూట్టమ్ వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు.
దేశంలో మన పాలకులు ప్రజలతోపాటు ప్రసార మాధ్యమాల గొంతుక వినిపించకుండా నొక్కేస్తున్నారని ఆరోపించారు. అందుకే నేరుగా ప్రజలతో మాట్లాడానికి జోడో యాత్ర ప్రారంభించామని తెలియజేశారు. మన దేశం, మన యువత మెరుగైన రేపటి రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోందని, ప్రతి ఉషోదయం తనతో కొత్త ఆశను, నమ్మకాన్ని నింపుతోందని రాహుల్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ‘దేశం కోసం అందరు, దేశం కోసం ప్రతి అడుగు’ అని పేర్కొన్నారు. విపక్షాల ఐక్యతకు బలమైన కాంగ్రెసే మూలస్తంభమని పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ సోమవారం ఢిల్లీలో మీడియాతో అన్నారు. యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.
ఇదీ చదవండి: విపక్షాల ఐక్యత అంటే అర్థం అది కాదు!
Comments
Please login to add a commentAdd a comment