లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు, ఫలితాలు వెలువడకముందే గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ నియోజకవర్గం నుచి బీజేపీ అభ్యర్ధి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన నీలేశ్ కుంభానీ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవంటూ రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ తిరస్కరించడం, మిగతా అభ్యర్ధులు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ముకేశ్ గెలుపు తథ్యమైంది..
తాజాగా సూరత్ కాంగ్రెస్ అభ్యర్ధి నీలేష్ కుంభానీ కనిపించడం లేదు. కనీసం ఫోన్‌లో కూడా అందుబాటులో లేడని, ఆయన ఇంటికి తాళం వేసి ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే కుంభానీ త్వరలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, ఆయన ఇంటి ముందు నిరసన చేపట్టారు. ఇంటి గోడలపై ‘ప్రజల ద్రోహి’ అంటూ పోస్టర్లు అంటించారు.
అయితే గుజరాత్‌లో అధికార బీజేపీ తప్పుడు ప్రభావం చూపిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సూరత్‌లో ఎన్నికలను వాయిదా వేయాలని, అలాగే ఎన్నికల ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని కోరినట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభానీ అభ్యర్ధిత్వాన్ని నలుగురు ప్రతిపాదకులు నామినేట్ చేశారని, అయినా.. అకస్మాత్తుగా నలుగురు తమ సంతకాలను తిరస్కరించడం ఆశ్యర్యంగా ఉందన్నారు. ఇది యాదృచ్ఛికం కాదని, అభ్యర్థి చాలా సమయం నుంచి కనిపించడం లేదని ఆరోపించారు.
చదవండి: MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాధారణంగా రాజ్యసభకు సభ్యులు నామినేట్ అవడం చూస్తుంటాం. కానీ లోక్‌సభలో ఏకగ్రీవం అనేది చాలా అరుదైన విషయం. కోట్లు కుమ్మరించి వ్యూహప్రతివ్యూహాలు పన్నిగెలుపు గుర్రాన్ని ఎక్కాల్సి ఉంటుంది. అయితే ప్రత్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడం, మిగతా వాళ్లు నామినేషన్లు ఉపసంహరించుకున్న ఘటనల్లో ఏకైక అభ్యర్థి పోటీలో నిలవడంతో.. వారే విజయపీఠాన్ని అధిరోహించిన సందర్భలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. తాజాగా అలాంటి పరిణామమే సూరత్‌లో బీజేపీ అభ్యర్ధి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంతో చోటుచేసుకుంది.
సూరత్ కాంగ్రెస్ తరపున నీలేశ్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాలు సరిపోలడం లేదని ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. అంతేగాక నీలేశ్‌కు ప్రత్యామ్నాయంగా సురేశ్ పడ్సాలాతోనూ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయించినప్పటికీ అది కూడా ఇతర కారణాలతో తిరస్కరణకు గురైంది. మరోవైపు, ఇదే స్థానం నుంచి పోటీకి దిగిన మిగతా 8 మంది సైతం తమ నామినేషన్లను చివరి రోజైన సోమవారం ఉపసంహరించుకున్నారు. దీంతో ముకేశ్ దలాల్ ఒక్కరే పోటీలో నిలవడంతో ఆయన ఏకగ్రీవంగా గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
సూరత్‌లో బీజేపీ బోణీ కొట్టడంపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్పందించారు.‘ ప్రధాని మోదీకి సూరత్ మొదటి కమలాన్ని అందజేసిందని తెలిపారు. ’’ అని గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. ‘‘ సూరత్‌లో సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపార వర్గాలు బీజేపీపై గుర్రుగా ఉన్నాయి. 1984 తర్వాత తొలిసారిగా సూరత్‌లో ఓడిపోతామన్న భయంతో ఇలా మ్యాచ్‌ఫిక్సింగ్ చేశారు’’ అని కాంగ్రెస్ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment