హిమాచల్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. మంత్రి రాజీనామా | Congress Leader Vikramaditya Singh Resigns As Himachal Minister | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. మంత్రి రాజీనామా

Published Wed, Feb 28 2024 11:30 AM | Last Updated on Wed, Feb 28 2024 11:40 AM

Congress Leader Vikramaditya Singh Resigns As Himachal Minister - Sakshi

సిమ్లా: కాంగ్రెస్‌ పాలిత హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ కుమారుడు, ప్రస్తుత మంత్రి విక్రమాదిత్య సింగ్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. 

ఈ సందర్భంగా విక్రమాదిత్య సింగ్‌ మాట్లాడుతూ.. నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను త్వరలో ముఖ్యమంత్రి, గవర్నర్‌కు సమర్పిస్తాను. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ప్రభుత్వంలో భాగంగా కొనసాగడం కరెక్ట్ కాదు. అందుకే మంత్రిమండలికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌ హైకమాండ్‌పై ఉంది.

ముఖ్యమంత్రి సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖు మా పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మా తండ్రి వీరభద్రసింగ్‌ను కూడా అగౌరవపరిచేలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యేల గొంతులను అణచివేయడం, హైకమాండ్ కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ఫైరయ్యారు.

ఇదిలా ఉండగా.. హిమాచల్‌ప్రదేశ్‌రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగి అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి ఓడిపోవడంతో ఇక్కడి ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీజేపీ ఆట మొదలు పెట్టింది. రాజ్యసభ ఎన్నికల మరుసటి రోజు బుధవారం ఉదయమే రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేత జైరాంఠాకూర్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష(ఫ్లోర్‌ టెస్ట్‌) నిర్వహించాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాను  కోరారు. అనంతరం జైరాం ఠాకూర్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీలో పడిందని, అందుకే గవర్నర్‌ను కలిసి  ఫ్లోర్‌ టెస్ట్‌ పెట్టాల్సిందిగా కోరామని తెలిపారు. 

మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజారిటీ కంటే దిగువకు పడిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు సమానంగా 34 ఓట్లు వచ్చి ఫలితం టై అయింది. లాటరీ తీయగా బీజేపీ అభ్యర్థి హర్ష్‌ మహజన్‌ గెలుపొందారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ మనుసింఘ్వి ఓటమి పాలయ్యారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement