
దీంతో ఆగ్రహించిన ఆయన తన కేబినెట్ పదవికి రాజీనామా చేశారు...
న్యూఢిల్లీ : 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం కొత్త ఎత్తులు వేస్తోంది. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, మాజీ క్రికెటర్, ఆ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య ఉన్న వివాదాలను సద్దుమణిగించే దిశగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధూకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వజూపుతోంది. బుధవారం సిద్ధూ సీఎం అమరీందర్ సింగ్‌ను కలిసే అవకాశం ఉంది. కాగా, సిద్ధూకు ముఖ్యమంత్రికి మధ్య 2019, మే నెలలో వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. 2019 లోక్ సభ ఎన్నికల సందర్బంగా సిద్ధూ పని తీరు బాగాలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆయన తన కేబినెట్ పదవికి రాజీనామా చేశారు.
అప్పటినుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నా కెప్టెన్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ.. కెప్టెన్( అమరీందర్ సింగ్)కు కెప్టెన్’’ అని వ్యాఖ్యానించారు. ప్యాన్ ఇండియా సెలెబ్రిటీ అయిన సిద్ధూను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. 2022లో జరగబోయే ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్‌గా ఆయనను రంగంలోకి దించే ఆలోచన చేస్తోంది.